- రూ.7,500 చొప్పున రైతు భరోసా చెల్లించాలి
- రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌లో మహాధర్నా
- సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు
- అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారంటూ బీఆర్ఎస్ లీడర్లను నిలదీసిన రైతులు
ఆర్మూర్, వెలుగు: షరతుల్లేకుండా సెప్టెంబర్ 15లోపు రైతులందరికీ ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరానికి రూ.7,500 చొప్పున రైతు భరోసా చెల్లించాలని ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించింది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు శనివారం ఆర్మూర్ లో రైతులు మహాధర్నా చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులోని ఆర్వోబీ నుంచి సెయింట్ పాల్స్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్‌రూరల్ మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, పల్లె గంగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఆలూర్ విజయభారతి, నూతుల శ్రీనివాస్ రెడ్డి, పాలెపు రాజు, రైతు ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు ఇట్టెడి లింగారెడ్డి, దేగాం యాదాగౌడ్, తిరుపతిరెడ్డి, వి.ప్రభాకర్, దేవారాం ధర్నాలో మాట్లాడారు. అనంతరం రైతు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ కు వినతి పత్రం అందజేశారు. మహాధర్నా సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.