హైదరాబాద్: జూలై 18నుంచి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు...మొదట లక్ష లోపు రుణాలకు సంబందించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి సుమారు 6వేల కోట్లు రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు. లక్షకు పైగా రుణాలు ఉన్నవారికి మరో పదిరోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తుమ్మల అన్నారు. మొత్తంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు.
కుటుంబ నిర్దారణ కోసమే రేషన్ కార్డు అని అన్నారు. పాత పద్దతిలోనే కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. 60 లక్షల ఖాతాల్లో 6 లక్షల మందికి రేషన్ కార్డు లేదు. అలాంటి వారికోసం రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో లక్ష రుణమాఫి చేస్తామని ఇచ్చిన కొన్ని డబ్బులు వడ్డీకే సరిపోయాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తుంటే బీఆర్ ఎస్ మామీద నిందలు వేస్తుందన్నారు. తెల్ల రేషన్ కార్డు అనేది కుటుంబ నిర్దారణ కోసమే అన్నారు. దాదాపు 38 లక్షల కుటుంబాలు రుణాలు తీసుకున్నాయన్నారు. రుణమాఫీకోసం రూ. 31వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు మంత్రి తుమ్మల.
గత ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసింది.. నేను చాలా ప్రభుత్వాల్లో పనిచేశాను. ఒకేసారి రుణమాఫీ చేసింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూలై 18న ప్రతి మండల కేంద్రాల్లో రైతు వేదికల్లో సంబరాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.