- ఒకేరోజు రూ.7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి: సీఎం రేవంత్
- రూ. లక్షన్నర అప్పు ఉన్నోళ్లకు ఈ నెలాఖరులోగా మాఫీ
- రూ. రెండు లక్షలు ఉన్నోళ్లకు ఆగస్టు 15 లోపు అమలు
- మూడు విడతల్లో దాదాపు రూ. 31వేల కోట్లు
- నేటి నుంచి మూడు రోజులు ఊరూరా సంబురాలు
- 20 ఏండ్లు గొప్పగా చెప్పుకునేలా రుణమాఫీ
- ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పినా అమలు చేస్తున్నం
- రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు
- రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : పంద్రాగస్టులోపు రైతులకు మూడు విడతలుగా పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి విడతగా గురువారం సాయంత్రం 4 గంటలలోపు రూ. లక్ష అప్పు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. రూ. లక్షన్నరలోపు రుణాలు ఉన్నవాళ్లకు రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని, రూ. రెండు లక్షల వరకు అప్పు ఉన్నవాళ్లకు మూడో విడతలో భాగంగా ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని, దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని సీఎం వెల్లడించారు. రుణ మాఫీ ద్వారా తొలి విడతలో రూ.7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని, మూడు విడతల్లో కలిపి దాదాపు రూ. 31వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరుతాయని వివరించారు.
బుధవారం ప్రజా భవన్లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘‘తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రుణమాఫీ నిర్ణయం. రాబోయే 20 ఏండ్ల పాటు దీని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి. దీనిపై రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా చూడాలి” అని పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు స్కీంల గురించి ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటున్నారని.. అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా చెప్పుకోవాలని అన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను మాట్లాడుతానని, అక్కడే రైతులంతా సమావేశం కావాలని సీఎం కోరారు.
రాహుల్ గాంధీ ఆదేశం మేరకే, ఆయన గతంలో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ అనే విషయాన్ని రైతులకు విస్తృతంగా తెలియజెప్పాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి మూడు రోజుల పాటు రైతుల సమక్షంలో ఊరూరా సంబురాలు నిర్వహించాలన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి
ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామని, దాని ప్రకారమే మాట తప్పకుండా అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని, అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాట నెరవేర్చేందుకు ఈ రుణమాఫీని అమలు చేస్తున్నామని వివరించారు. ‘‘2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు.
ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు కలిగించడం మా బాధ్యతగా గుర్తించి ఈ సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇది కాంగ్రెస్ కు నష్టమని తెలిసి కూడా ఆమె నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలు చేసే నిర్ణయం తీసుకున్నాం” అని ఆయన తెలిపారు.
రేషన్ కార్డులు లేని 6 లక్షల కుటుంబాలకూ మాఫీ : భట్టి
రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా భవన్ లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ...ఆగస్టు 15 దాటకుండానే రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. దీన్ని అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని.. రూపాయి, రూపాయి పోగుచేసి అమలు చేస్తున్నామని తెలిపారు. ‘‘రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లాలి. ప్రజల ముందు తల ఎత్తుకొని ప్రచారం చేయాలి.
మీరు ఎక్కడ కూడా తలదించుకునే రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించదు” అని ఆయన అన్నారు. మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని రూ. 25 వేల చొప్పున నాలుగు దఫాలుగా పూర్తి చేసిందని చెప్పారు. రూ. 7 లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే పూర్తి చేయబోతున్నదని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలను అమలు చేస్తున్నామని, అయితే అనుకున్న స్థాయిలో ఈ పథకాలకు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదని ఆయన అన్నారు.
‘‘పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారు. సీఎం సవాల్ ఓట్ల కోసమేనని, ఇది ఎన్నికల సవాల్ అని అంతా అనుకున్నారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ రుణమాఫీని అమలు చేయబోతున్నాం. కాంగ్రెస్ నేతలందరికీ ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం. చెప్పిన మాట ప్రకారం దీన్ని అమలు చేస్తున్నామని ప్రతి గ్రామానికి కాంగ్రెస్ నాయకులు వెళ్లి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది.
ఈ రుణమాఫీ రైతులు, ప్రజల హృదయాలను గెలుస్తుంది” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పీసీసీ కార్యవర్గ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, మధు యాష్కీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలకు పాలాభిషేకం
రుణమాఫీ అమలు నిర్ణయాన్ని ప్రకటించినందున ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకు కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పినా..!
ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించినా ఇచ్చిన మాట నెరవేర్చాలనే దృఢమైన తపనతో సాధ్యం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని, వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలన్నదే తన తపన అని, అందుకే రుణమాఫీ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.
‘‘ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మేం మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టాలనుకోలేదు” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని.. అందుకోసం గురువారం నుంచి పల్లెల్లో, మండలాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో రైతు వేదికల వరకు ర్యాలీ, బైక్ ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ సూచించారు.
నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే రుణమాఫీ ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని, ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణంలో సంబురాలు జరపాలని అన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని, దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగేలా చూడడంలో మీ పాత్రే కీలకం కావాలని ఆయన సూచించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ. 31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్ లో మన ఎంపీలు ప్రస్తావించాలని నేతలతో ఆయన పేర్కొన్నారు.