నెక్కొండ, వెలుగు: నాబార్డు నుంచి లోన్లు వస్తాయంటూ రైతులను నమ్మించి మాజీ సర్పంచ్రూ. 80లక్షలు స్వాహా చేశాడు. అమౌంట్ కట్టాలంటూ నోటీసులు రావడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాకు చెందిన 150 మంది రైతులకు నాబార్డు నుంచి లోన్లు వస్తాయని, అవి తీసుకుంటే మాఫీ అవుతాయని 2021లో తండాకు చెందిన మాజీ సర్పంచ్ బోడ బద్దు నాయక్నమ్మించాడు.
ఆయా రైతుల వద్ద ఆధార్‌కార్డు, సంతకాలు తీసుకుని నెక్కొండ డీసీసీబీ బ్యాంకులో ఇచ్చాడు. బర్ల కోసం ఇచ్చిన లోన్అమౌంట్వెంటనే చెల్లించాలంటూ బుధవారం డీసీసీబీ నుంచి రైతులకు నోటీసులు అందాయి. దీంతో బాధితులు గురువారం బ్యాంకుకు వెళ్లి లోన్లు తీసుకోలేదని, నోటీసులు ఎలా ఇస్తారంటూ మేనేజర్‌ను ప్రశ్నించారు. డెయిరీఫామ్ కింద జేఎల్‌జీ స్కీమ్ లో లోన్ తీసుకున్నట్లు సంతకాలు.. బర్ల ఫొటోలు చూపించడంతో షాక్ కు గురయ్యారు.
తమ సంతకాలను ఫోర్జరీ చేసి, మార్ఫింగ్ ఫొటోలతో మాజీ సర్పంచ్బద్దు నాయక్ లోన్లు తీసుకున్నాడని మేనేజర్‌తో వాదనకు దిగారు. అనంతరం గిరిజనులు శశిధర్, బోడ శ్రీనివాస్, జర్పుల సుమన్, బాలు, నర్సు, గోపా బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. బ్యాంకు మేనేజర్వినితను వివరణ కోరగా.. 2021లో రైతులకు డెయిరీఫామ్ కింద జేఎల్‌జీ స్కీమ్ లో రూ.80లక్షలు లోన్ ఇచ్చినట్లు చెప్పారు. లోన్లతో తమకు సంబంధం లేదని రైతులు చెబుతున్నారని,దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.