- రూట్ మార్చిన సిడ్బీ
- చిన్న వ్యాపారుల కోసం డిజిటల్ ప్రయాస్, జీఎస్‌టీ సహాయ్, ఈ-ఉద్యం రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లు
- జీఎస్‌టీ, బ్యాంక్ స్టేట్‌మెంట్ల డేటా ద్వారా వేగంగా లోన్ల డిస్‌బర్స్‌మెంట్
- సిడ్బీని ఫిన్‌టెక్ స్టైల్‌లో నడుపుతున్న చైర్మన్ శివసుబ్రమణియన్ రామన్
బిజినెస్ డెస్క్, వెలుగు: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) తన రూపురేఖలను మార్చేసింది. డిజిటల్ బాట పట్టింది. చిన్న వ్యాపారాలకు (ఎంఎస్‌ఎంఈలకు) లోన్లను ఇచ్చే ఈ సంస్థ, రూ. కోటి వరకు లోన్లను కూడా డిజిటల్ రూట్‌లోనే ఇస్తోంది. కొత్త ఫిన్‌టెక్ కంపెనీగా మారుతోంది. ప్రస్తుత చైర్మన్ శివసుబ్రమణియన్ రామన్ నేతృత్వంలో సిడ్బీ చాలా మారిందని చెప్పొచ్చు. ఎంఎస్‌ఎంఈలకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని ఆయన చూస్తున్నారు. రామన్ గ్రౌండ్‌లో తిరిగి ఎంఎస్‌ఎంఈలకు ఏం కావాలో దగ్గరుండి తెలుసుకుంటారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలోని సిడ్బీ చిన్న వ్యాపారాలకు లోన్లను ఇచ్చే విధానాన్ని మార్చుకుంటోందని అన్నారు. ఈ సంస్థలో 2021 ఏప్రిల్‌లో జాయిన్ అయ్యేముందు రామన్ నేషనల్ ఈ–గవర్నర్నెన్స్ సర్వీసెస్ (ఎన్‌ఈఎస్‌ల్) కు సీఈఓగా పనిచేశారు. 1,100 స్ట్రాంగ్ వర్క్‌ఫోర్స్‌ను ఆయన నడిపారు. తాను పనిచేయడానికి డిజిటల్ మార్గం బెస్ట్ అని రామన్ నమ్ముతారు. కాగా, చిన్న వ్యాపారాలకు వివిధ మార్గాల్లో సిడ్బీ ఫైనాన్సింగ్ అందిస్తోంది. ఇందులో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ద్వారా ఇచ్చే ఇన్‌డైరెక్ట్ లోన్లు ఉన్నాయి. అలానే డైరెక్ట్‌గా కూడా అప్పులిస్తోంది. సిడ్బీ మొత్తం అప్పుల్లో డైరెక్ట్‌గా ఇచ్చే వాటా 10 శాతంగా ఉంది. అంటే ప్రస్తుతం వీటి విలువ రూ.20 వేల కోట్లుగా ఉంది. ఆటో పార్టులు, సెరమిక్ టైల్స్, గ్లాస్ లాంతర్లు వంటివి తయారు చేసే చిన్న కంపెనీలకు వర్కింగ్ క్యాపిటల్‌ను అందించడం వాటికి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వడమే సిడ్బీ పని. ఈ సంస్థ డిజిటల్ మార్గంలో డైరెక్ట్‌గా లోన్లను ఇస్తోంది.
ఎంఎస్‌ఎంఈల ఇబ్బందులు పోలేదు..
దేశ ఎకానమీకి ఎంఎస్‌ఎంఈలు వెన్నెముక అయినప్పటికీ అప్పులు పొందడంలో ఇవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. దీనికి కారణం ఇన్‌ఫార్మాల్ సెక్టార్‌లో ఎక్కువ చిన్న వ్యాపారాలు ఉండడం, వీటి క్రెడిట్ స్కోర్ రికార్డ్‌లు లేకపోవడం ప్రధాన కారణం. అంతేకాకుండాచాలా చిన్న వ్యాపారాలకు లోన్లను పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయని తెలియకపోవడం. సిడ్బీ ఎంఎస్‌ఎంఈలకు సాయం చేసి ఫైనాన్సింగ్ అందేలా చేస్తోంది. డిజిటల్ టూల్స్‌ను వాడుకొని వారికి సాయపడుతోంది.
ALSO READ:త్వరలో నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ చేంజ్.. ఐఆర్డీఏ చైర్మన్ వెల్లడి
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి డేటాను సేకరించి..
రూ.కోటి వరకు విలువున్న లోన్లను కూడా సిడ్బీ డిజిటల్ మార్గంలో ఇస్తోంది. పేపర్‌లెస్ ప్రాసెస్‌తో ఎంఎస్‌ఎంఈలకు అప్పులు తొందరగా అందేలా చేస్తోంది. ‘ వ్యాపారాల జీఎస్‌టీ, ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ డేటాతో పాటు సెబీ, క్రెడిట్ బ్యూరోల నుంచి క్రెడిట్ స్కోర్‌ను పొందుతాం. 85 శాతం రిస్క్‌ను అరగంటలోనే లెక్కిస్తాం’ అని సిడ్బీ చైర్మన్ రామన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ సర్వీస్‌లను తీసుకొచ్చామని వివరించారు. ఇప్పటికే కస్టమర్లుగా ఉన్నవారికి లోన్లను వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలుంటోందని చెప్పారు. కొత్త వారికి లోన్లు ఇచ్చేటప్పుడు అదనపు చెకింగ్స్ ఉంటాయన్నారు. ఎంఎస్‌ఎంఈలకు వర్కింగ్ క్యాపిటల్ లోన్లను ఇచ్చేందుకు సిడ్బీ జీఎస్‌టీ సహయ్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వ్యాపారాల ఇన్‌వాయిస్‌ల ఆధారంగా లోన్లు ఇస్తోంది. దీంతో సుమారు 1.5 కోట్ల జీఎస్‌టీ ఫైల్ చేస్తున్న ఎంఎస్‌ఎంఈలకు సాయపడుతోంది. జీఎస్‌టీ ఫైల్ చేయని వారి డేటాను పార్టనర్లు ఎంఎఫ్‌లు , ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల నుంచి డేటాను సేకరించి, తాను లోన్లు ఇవ్వడంలో వాడుతోంది. కాగా, సుమారు 6 నుంచి ఏడు కోట్ల ఎంఎస్‌ఎంఈలు జీఎస్‌టీ ఫైల్ చేయడం లేదని అంచనా.