ఖమ్మంలో నకిలీ పత్రాలతో లోన్లు

ఖమ్మంలో నకిలీ పత్రాలతో లోన్లు
  • ఖమ్మంలో బయటపడుతున్న బాగోతం
  • మోసగాళ్ల ఆచూకీ కోసం గాలిస్తున్న బ్యాంకర్లు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలోని డీసీసీబీకి చెందిన రెండు బ్రాంచ్ లలో కేటుగాళ్లు ఫేక్  అడ్రస్  ప్రూఫ్ లతో నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి లోన్లు పొందిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డీసీసీబీ బ్యాంకుతో పాటు మరో ఆరు కార్పొరేట్  బ్యాంకుల్లో కూడా ఇదే తరహా మోసం జరిగినట్లు ఆయా బ్యాంకుల అధికారులు గుర్తించారు. ఖమ్మం నగరంలోని ఏపీజీవీబీ, మహారాష్ట్ర, బీవోఐ, పంజాబ్ తదితర  బ్యాంకుల్లో నకిలీ బ్రాస్ లెట్లు,ఫేక్  పత్రాలతో క్రాప్​లోన్లు పొందినట్లు చెబుతున్నారు. మోసపోయిన బ్యాంకుల్లో ఎస్బీఐ బ్రాంచ్​ కూడా ఉందని సమాచారం. 

డీసీసీబీ బ్యాంక్​ అధికారులు మాత్రం రెండు బ్రాంచ్ లలో కలిపి సుమారు రూ.10 లక్షల లోన్లు పొందినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం నాలుగు రోజుల కింద గుర్తించిన ఆఫీసర్లు, ఇంటర్నల్​ ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే ఖమ్మం నగరంలోని ట్రంక్​ రోడ్డులో ఉన్న ఏపీజీవీబీ బ్రాంచ్​లో ఇలాగే లోన్లు తీసుకున్నట్లు బయట పడింది. నకిలీ బంగారంతో లోన్లు ఇచ్చి మోసపోయామని ఆయా బ్యాంకుల స్టాఫ్  గుర్తించి, వారి అడ్రస్ కు వెళ్లి ఆరా తీయగా.. మోసం చేసిన వారు అందుబాటులోకి రాలేదు. వారిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టకుండా, రికవరీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పోలీస్  కేసు పెడితే లోన్ల రికవరీ సాధ్యం కాదనే ఉద్దేశంతో, మోసగాళ్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదిలాఉంటే మోసగాళ్లకు సహకరించిన, లోన్లు ఇచ్చిన ఉద్యోగుల పాత్ర ఎంత ఉందనే విషయంపై ఉన్నతాధికారులు విచారిస్తున్నారు.