- రాష్ట్ర సర్కారు సెంట్రల్ ఫండ్స్ ఫ్రీజ్ చేయకుండా చర్యలు
- పీఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా పంచాయతీలకు నిధులు
- గ్రామ ఆదాయాన్ని సైతం ఈ ఖాతాలో జమ చేసుకోవచ్చు
- తీరనున్న సర్పంచుల తిప్పలు
వనపర్తి, వెలుగు: గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం లేకుండా చర్యలు చేపట్టింది. కేంద్రం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ చేసే అవకాశం లేకుండా ప్రతి పంచాయతీ కొత్త బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నాటికి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచుల పేరిట జాయింట్ అకౌంట్లు ఓపెన్ కాబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఫండ్స్కేటాయిస్తోంది. గ్రామంలోని ప్రతి వ్యక్తికి రూ. 1,760 చొప్పున ఎంత జనాభా ఉంటే అంత మొత్తం ఇస్తోంది. అయితే ఆ నిధులను గ్రామ అవసరాలకు వాడకుండా స్టేట్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేస్తోంది. ఇతర అవసరాల కోసం ఆ ఫండ్స్ వాడుతూ సర్పంచులకు చుక్కలు చూపిస్తోంది. దీనిపై సర్పంచులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కేంద్రం ఇచ్చే 15వ ఫైనాన్స్ నిధుల కోసం ఖాతాలు తెరవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇన్నాళ్లు గ్రామపంచాయతీలకు కేవలం ఒకే బ్యాంక్ ఖాతా ఉండేది. సర్పంచ్, ఉపసర్పంచ్ పేర జాయింట్ ఖాతా తెరిచేవారు. ఇద్దరికి చెక్ పవర్ ఉండేది. గ్రామాల్లో చేసిన పనులకు తీర్మానం చేసి థర్డ్ పార్టీ పేరిట చెక్ లను జారీ చేస్తారు. గ్రామపంచాయతీ ఖాతాలో ఫండ్స్ఉన్నా ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆఫీసుల్లో ఈ చెక్కులను పేమెంట్ చేయకుండా నిలిపివేసేవారు. ఇప్పుడు అప్పుడు అంటూ పనులు చేసిన కాంట్రాక్టర్లను చెప్పులు అరిగేలా తిప్పుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఇతర అవసరాలకు వాడుకోవడంతో ఈ పరిస్థితి ఉండేది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం వల్ల గ్రామాల్లో పనులు చేసిన వెంటనే బిల్లులు పొందే అవకాశాలు ఉన్నాయి.
ఆదాయం ఉన్నా వాడుకోలేక..
రాష్ట్ర సర్కారు తీరు కారణంగా ఫండ్స్ ఉన్నా ఇన్నాళ్లు సర్పంచులు తిప్పలు పడాల్సి వచ్చింది. ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయి. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని కర్నె , భగత్ సింగ్ తండా, ఆత్మకూర్ మండలంలోని రేచింతల, వీపనగండ్ల మండలంలోని తూంకుంట తదితర గ్రామాల్లో ఇసుక రీచ్ లకు ప్రభుత్వం పర్మిషన్ఇచ్చింది. ఇసుక ద్వారా గ్రామ పంచాయతీలకు నెలనెలా రూ. లక్షల ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులను గ్రామ అవసరాల కోసం వినియోగించుకోవాలని సర్పంచ్ లు ప్రతిపాదనలు పంపి పనులు చేపట్టారు. తీరా పనులు చేశాక జీపీ అకౌంట్లు ఫ్రీజ్కావడంతో వీరికి ఆరు నెలలుగా బిల్లులు రావడం లేదు. దీంతో మదనాపురం మండలం భగత్ సింగ్ తండాకు చెందిన సర్పంచ్ మణ్యంనాయక్ నిధులు ఎందుకు ఆపుతున్నారంటూ ఇటీవల ఎంపీడీవో ఆఫీసు ముందు పురుగులమందు తాగారు. అక్కడివారు ఆయనను రక్షించారు. ఇదే విధంగా అజ్జకొల్లు గ్రామానికి చెందిన కుర్వ చంద్రమ్మ, మన్నెమ్మ మహిళా సంఘాల తరపున రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. పనులు చేసి 6 నెలలు పూర్తయినా డబ్బులు చేతికందకపోవడంతో వారు అప్పులపాలయ్యారు. వీరు మదనాపురం ఎంపీడీవో ఆఫీసు ముందు నిరసన చేపట్టగా ఇటీవల జీపీ అకౌంట్ ఫ్రీజింగ్ ను ఎత్తేసి డబ్బులు ఇచ్చారు.
పీఎఫ్ఎంఎస్ ద్వారా..
గ్రామ పంచాయతీలకు వివిధ వనరుల ద్వారా నిధులు వస్తుంటాయి. ముఖ్యంగా స్టేట్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్, సాధారణ పనులు, ట్యాక్స్, ఇసుక రీచ్ లు, ఇతర సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమవుతుంది. ఈ డబ్బును తిరిగి తీసుకొవాలంటే మాత్రం ట్రెజరీ ఆమోదం తప్పనిసరి. దీనివల్ల సర్పంచులు గ్రామాల్లో చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సర్పంచులు అప్పులపాలై సూసైడ్ సైతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీలు ఓపెన్ చేస్తున్న కొత్త ఖాతాల్లోనే కేంద్రం 15వ ఫైనాన్స్ ఫండ్స్ జమవనున్నాయి. గ్రామాల్లో వసూలయ్యే జనరల్ పన్నులు సైతం సర్పంచులు ఈ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ట్రెజరీలో ఈ నిధులను ఫ్రీజ్ చేసేందుకు అవకాశం లేకుండా కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పీఎఫ్ఎంఎస్(పబ్లిక్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్‌సిస్టం) ద్వారా నేరుగా సర్పంచ్ ఫండ్స్‌ను వినియోగించేందుకు అధికారం ఉంటుంది. ఇకపై ఈ నిధులు గ్రామంలో అన్ని అవసరాలకు ఉపయోగపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు జీపీ అకౌంట్ లో నిధులు ఉన్నా వాడుకోలేని దుస్థితి ఉండేదని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదంటున్నారు.
జీరో అకౌంట్లు తెరవమన్నరు
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం కొత్త ఖాతాలు తెరవాలని ఎంపీడీవోలు చెప్పడంతో జీపీ కోడ్‌తో ఖాతాలు తెరుస్తున్నం. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రం ఇచ్చే నిధులు ఈ ఖాతాలో జమవుతయ్. దీని వల్ల ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందన్న విషయం కూడా ప్రజలకు తెలుస్తది. ఏప్రిల్ 1 వరకు అకౌంట్తెరవాలని అధికారులు చెప్పిన్రు.
- శ్రీనివాస్ యాదవ్,
సర్పంచ్, రాయిని పేట
ప్రత్యేక శిక్షణ ఇస్తున్నం
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జీపీకి మరో అకౌంట్ తెరవాలని కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనిపై డీపీఎం, ఎంపీఓ, సెక్రటరీ, సర్పంచులకు సోమవారం నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉంటుంది. పూర్తి విధివిధానాలు త్వరలో వెల్లడిస్తాం.
- సురేశ్‌కుమార్, డీపీఓ, వనపర్తి