మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు

 

  • అప్పటిలోగా బీసీ కులగణన పూర్తి: సీఎం రేవంత్​రెడ్డి

  • ఈ ఏడాది చివరికల్లా మరో 35 వేల ఉద్యోగాల భర్తీరాబోయే పంట నుంచే సన్నవడ్లకు రూ.500 బోనస్​

  • ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినం.. రాజీనామా చేస్తానన్న హరీశ్​ ఏడ దాక్కున్నడు?

  • ఇది ప్రజా ప్రభుత్వం.. రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్​దే అధికారం

  • రాహుల్​ను ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని వ్యాఖ్య

  • పీసీసీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్

 హైదరాబాద్, వెలుగు: మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ఆలోపే బీసీ కుల గణన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్​ నాయకులంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. 

పీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆదివారం గాంధీ భవన్​లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ పీసీసీ చీఫ్​గా ఉన్న సీఎం రేవంత్​రెడ్డి ఆ బాధ్యతలను మహేశ్​ గౌడ్​కు అప్పగించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే అది కార్యకర్తల శ్రమేనని, తమ ఎన్నికల కన్నా ఎక్కువగా లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కష్టపడుతామని చెప్పారు. సమన్వయంతో ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త ముందుకు కదిలితే, ఫామ్​హౌస్​లో సేద తీరుతున్న కేసీఆర్ గుండెలు అదరాలని అన్నారు. 

‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను సర్పంచ్​లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, జెడ్పీ చైర్​పర్సన్లుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నాపైన, పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​పైన ఎక్కువగా ఉన్నది. భుజాలమీద కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుందాం. అందరినీ మహేశ్​గౌడ్​ సమన్వయం చేస్తరు. నాయకులందరం కలిసి కార్యకర్తలను గెలిపించుకుంటేనే నిజమైన విజయం” అని సీఎం పిలుపునిచ్చారు. 

2029లో రాహుల్​ను ప్రధానిని చేసుకుందం

మొన్న గెలిచిన ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని, 2029 ఎన్నికలే ఫైనల్ అని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికల్లో గెలిచి,  రాహుల్​ గాంధీని ప్రధాని చేసి, ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వెన్నల జెండాను ఎగురేసినప్పుడే ఫైనల్స్​ గెలిచినట్టన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాలు గెలవాలని, అందు కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్ దే అధికారమని, మొన్నటి ఎన్నికల్లో గెలవడమే కాదు రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్​ పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను జోడెద్దుల్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.  

మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు

గత మూడు రోజులుగా తమ కార్యకర్తలపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అయితే తమ కార్యకర్తలు ఎవరి జోలికి పోరని, ఎవరైనా తమ కార్యకర్తల మంచి తనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండేనని బీఆర్ఎస్ ను సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘కొత్త పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దు.. ఆయన వెనకాలే నేను ఉన్నాననే విషయాన్ని మరిచిపోవద్దు. కాంగ్రెస్​ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు” అని చెప్పారు. 

ఏడాది చివరి నాటికిమరో 35 వేల ఉద్యోగాలు భర్తీ

అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ ఏడాది చివరి నాటికి మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్​ వెల్లడించారు. దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. 

వచ్చే ఒలింపిక్స్​లో పథకాలే లక్ష్యం

తెలంగాణ కలను సోనియమ్మ సాకారం చేశారని, అయినా పదేండ్లు బీఆర్​ఎస్​ పాలనలో తెలంగాణ ప్రజలు అవస్థలు పడ్డారని, ఆ అవస్థలు భరించలేక ప్రజలు కాంగ్రెస్​ను అధికారంలోకి తెచ్చుకున్నారని సీఎం రేవంత్ అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదని తెలిపారు. 19 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి, 30 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశామని చెప్పారు. క్రీడా స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 140 కోట్ల జనాభా ఉన్నా దేశానికి ఒలింపిక్స్ లో ఒక్క బంగారు పతకం కూడా రాకపోవడం అవమానకరమని,  వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దీక్షబూనిందని, 2028 లో ఒలింపిక్స్ లో దేశం తరపున బంగారు పథకాలు సాధించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్రానికి రాబోతున్నదని, ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీ పేరుతో ముచ్చర్లలో ఆధునాతనంగా తమ ప్రభుత్వం నిర్మించబోతున్నదని వెల్లడించారు. ఇప్పటి వరకు 85 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని, రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ పేదల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నామన్నారు.

2 లక్షలకు పైగా రుణాలున్న రైతులకూ మాఫీ

ఇది రైతు రాజ్యమని,  వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్​ చెప్పారు.  23 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 18  వేల కోట్లు వేశామన్నారు. ‘‘పంద్రాగస్టులోపే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అమలు చేసి చూపించినం. దూలం లెక్క పెరిగినా బుద్ధి మాత్రం పెరగని ఓ సన్నాసి.. పార్లమెంట్​ ఎన్నికల టైమ్​లో రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిండు. మరి ఆ సన్నాసి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నడు?” అని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. రూ. 2 లక్షలకు పైగా రుణాలున్న రైతులను కూడా ఆదుకుంటామని, రెండు లక్షలకుపైగా ఉన్న రుణాల్లో ఆపై సొమ్మును చెల్లిస్తే మిగతా రూ.2లక్షల రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. రాబోయే పంట నుంచే సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటామన్నారు.  

కాంగ్రెస్​ కార్యకర్తల జోలికొస్తే   వీపు చింతపండైతది

మూడు రోజులుగా మా కార్యకర్తలపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నరు. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా కార్యకర్తల మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండైతది. పీసీసీ కొత్త చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దు.. ఆయన వెనకాలే నేను ఉన్నాననే విషయాన్ని మరిచిపోవద్దు. కాంగ్రెస్​ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు.  సీఎం రేవంత్​ రెడ్డి