సెప్టెంబర్ లో పంచాయతీ ఎన్నికలు?

సెప్టెంబర్ లో పంచాయతీ ఎన్నికలు?
  •  పాలకవర్గం టెన్యూర్ పూర్తై ఆరు నెలలు
  •  ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెలు
  •  ఆరు నెలలు దాటితే ఆగనున్న కేంద్రం ఫండ్స్
  •  వేగంగా ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  •  కులగణనకు ఐదు నెలలు పట్టే అవకాశం
  •  దీంతో ముందే ఎన్నికల నిర్వహణకు సర్కారు మొగ్గు
  •  సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తున్న సీఎం

హైదరాబాద్: పల్లెల్లో ఎన్నికల నగారా మోగనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 31తో గ్రామపంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. ఆగస్టు 1 నాటికి ఆరు నెలల పూర్తవుతుంది.

ప్రస్తుతం పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఆరు నెలలు దాటితే  కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు రావాల్సిన గ్రాంట్స్ ఆగిపోనున్నాయి. దీంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని ప్రాధాన్యతా అంశంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. అయితే కుల గణన నిర్వహించిన తర్వతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

కులగణన చేయడానికి ఐదు  నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కిపోతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి ఆ లోపే ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

గవర్నర్ ఆమోదిస్తే 234 కొత్త గ్రామాలు

రాష్ట్రంలో మెుత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉన్నాయి.  234 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు గురించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు నూతన 234 గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ఉద్దేశించిన పెండింగ్ ఫైల్‌పై సంతకం పెడితే మొత్తం 13,003కు చేరుతుంది. పార్టీల గుర్తులపై కాకుండా ఈ ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో వార్డు సభ్యులను, సర్పంచులను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. 

క్యాబినెట్ లోనూ చర్చ

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆగస్టు 1న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీసీ కులగణనపై ఓ కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు కృతనిశ్చయంతో ఉందని తెలుస్తోంది. కేంద్రం నిధులను దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది.