
= మెజార్టీ ఓట్లు ఎంఐఎం పార్టీకే
= ఎంఐఎం మద్దతులో కాంగ్రెస్ పోటీ చేస్తుందా?
= గెలుపు కోసం ఇరు పార్టీల మధ్య సపోర్ట్ మస్ట్
= బీజేపీ, బీఆర్ఎస్ కు ఉన్నది అరకొర సీట్లే
= హాట్ టాపిక్ గా లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం
హైదరాబాద్: స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. శుక్రవారం (మార్చి 28) ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఏప్రిల్ 4వ తేదీ వరకు సాగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్లుగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. మొత్తం 109 మంది ఓటర్లు ఇక్కడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
వీరిలో 81 మంది కార్పొరేటర్లు 28 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో ఆరుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్ ఎంపీ), గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తరఫున ముగ్గురు రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, సురేశ్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.
ALSO READ | హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మెట్రో ఛార్జీలు..? ఎంత పెరగొచ్చంటే..
ఎంఐఎం తరఫున ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహియుద్దీన్, జుల్ఫీకర్ అలీ, జాఫర్ హుస్సేన్, మొబిన్, బలాలతో పాటు ఎమ్మెల్సీ బేగ్ అలీ ఉన్నారు. కాంగ్రెస్ ఎక్స్ అషీషియో సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఎంఎస్ ప్రభాకర్ రావు, అమీర్ అలీఖాన్, కోదండరాం(తెలంగాణ జన సమితి) కొనసాగుతున్నారు మొత్తంగా 28 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 81 మంది కార్పొరేటర్లు, 28 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు.
109 ఓట్లకు గాను పార్టీల వారీగా బలాలను చూస్తే ఎంఐఎంకు అత్యధికగా 49 ఓట్లున్నాయి. వీరిలో నలభై మంది కార్పొరేటర్లు మిగతా తొమ్మిది మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఎంఐఎంకు ఉన్న సొంత బలం గెలుపునకు సరిపోయే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు తీసుకోవడమా..? లేదా మద్దతు ఇవ్వడమా..? అనే ది డిసైడ్ అయితే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎవరన్నది తేలుతుంది.
అదే విధంగా బీఆర్ఎస్ కు 15 మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీగా గెలవాలంటే మద్దతు అనేది మస్ట్. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు ఇస్తుందా..? లేక ఎంఐఎం నుంచి మద్దతు తీసుకొని సొంత పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.