- కాంగ్రెస్ వైపు చూస్తున్న వేముల
- ఇయ్యాల అనుచరులతో మోత్కుపల్లి మీటింగ్
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్లో అసమ్మతి భగ్గుమంటున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడంపై లోకల్ లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. రెండ్రోజులుగా జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం నల్గొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, కోదాడ నియోజకవ ర్గాల్లో సమావేశాలు జరిగాయి. బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన నకిరేకల్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘‘పైసలకు నేనెప్పుడూ అమ్ముడుపోలేదు.
పార్టీ కోసమే కష్టపడి పనిచేశా. నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో టికెట్వస్తుందని వెయిట్ చేశాను. కానీ ఉద్యమ ద్రోహులకు టికెట్లు ఇచ్చి, నాలాంటి వాళ్లకు అన్యాయం చేశారు” అని వేముల ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతానని ప్రకటించారు. ‘‘నాపై వస్తున్న ఆరోపణలపై చర్చించేందుకు సిద్ధం. నా కొడుకు, నా అనుచరులు.. అలాగే ఆ నాయకుడి కొడుకు, అనుచరులను నిలబెట్టి నార్కో టెస్టులు చేయించండి. ఎవరు గంజాయి తాగుతున్నారో తేలిపోతుంది” అని మంత్రి జగదీశ్ రెడ్డికి సవాల్ విసిరారు. తన అనుచరులపై దాడులు చేస్తే, చిలిపి చేష్టల బండారం బయట పెడ్తానంటూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పరోక్షంగా హెచ్చరించారు. కాగా, వేముల కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిసింది.
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: రామరాజు
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని లోకల్ లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని బీఆర్ఎస్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ప్రకటిం చారు. ఆయన బుధవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘‘ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్గొండను అభివృద్ధి చేయకుండా, పక్క నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇదేందని ప్రశ్నిస్తే కార్యకర్తలను వేధిస్తున్నారు. కాంట్రాక్టులన్నీ తన అనుచరులకు, నాన్ లోకల్ వాళ్లకు కట్టబెట్టి అవినీతికి పాల్పడుతున్నారు” అని రామరాజు ఆరోపించారు.
సీఎం అపాయింట్ మెంట్ ఇయ్యలే: మోత్కుపల్లి
పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన చెందారు. ‘‘సీఎం కేసీఆర్ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను. నన్ను పక్కన పెట్టుకునే దళిత బంధు స్కీమ్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత నాకు పార్టీలో ఎలాంటి ఆదరణ లేకుండా పోయింది. కనీసం కలిసేందుకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు” అని మోత్కుపల్లి బుధవారం తన సన్నిహితులతో వాపోయినట్టు తెలిసింది. దళిత బంధు స్కీమ్‌లో భారీ అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌కు టికెట్ఇచ్చి, తనకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వలేదని మోత్కుపల్లి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో గురువారం యాదగిరిగుట్టలో ముఖ్య నాయకులతో మోత్కుపల్లి సమావేశం కానున్నారు.
కోదాడ, నాగార్జునసాగర్ అభ్యర్థులను మార్చండి..
కోదాడ, నాగార్జునసాగర్ అభ్యర్థులను మార్చాలని ఆయా నియోజకవర్గాల్లో లోకల్ లీడర్లు తీర్మానాలు చేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టికెట్ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద ర్రావు, కన్మంత శశిధర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పాండురంగారావు, మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష, రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు, పలువు రు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కోదాడలో జరుగుతున్న అవినీతికి ఎమ్మెల్యే నే కారణమని ఆరోపిస్తూ.. కేసీఆర్‌కు బహిరంగ లేఖ కూడా రాశారు. మరోవైపు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ టికెట్ రద్దు చేయాలని గుర్రంపోడు మండల ప్రజాప్రతినిధులు తీర్మానం చేశారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ సహా పలువురు సర్పంచ్‌లు, పార్టీ నాయకులు మండలంలోని కొప్పోలు గ్రామంలో సమావేశమయ్యారు.