కరీంనగర్​లో లోకల్, నాన్​లోకల్ వార్

కరీంనగర్​లో లోకల్, నాన్​లోకల్ వార్
  • కరీంనగర్​లో లోకల్, నాన్​లోకల్ వార్ 
  • బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు
  • మాజీ ఎంపీ వినోద్​కుమార్​ నాన్​లోకల్​ అంటూ బీజేపీ ప్రచారం
  • గులాబీ పార్టీకి తలనొప్పిగా మారిన వ్యవహారం
  • కరీంనగర్ నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్​లోనూ డిమాండ్లు

కరీంనగర్, వెలుగు: లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​రాక ముందే కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో క్యాంపెయిన్ ​మొదలైంది. ఇప్పటికే సిట్టింగ్​ఎంపీ బండి సంజయ్ కుమార్​కే టికెట్​అని బీజేపీ ప్రకటించగా, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్​ను కరీంనగర్ ఎంపీగా గెలిపించుకోవాలని కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాల్లో కోరారు.

ఈ నేపథ్యంలో వినోద్, బండి సంజయ్ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూనే, ఒకరిపైఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ‘నేను లోకల్.. వినోద్ కుమార్ నాన్ లోకల్’ అంటూ బండి సంజయ్ చేసిన కామెంట్లు పొలిటికల్​హీట్​పెంచాయి. బీజేపీ సోషల్ మీడియా టీమ్ బండి కామెంట్లను వైరల్ చేస్తోంది. 

బీఆర్ఎస్​కు తలనొప్పి

బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్​లో అయోధ్యలో రామాలయం, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఫండ్స్, నేషనల్ హైవేలకు తీసుకొచ్చిన నిధులు, బీఆర్ఎస్ వైఫల్యాలతోపాటు లోకల్, నాన్​లోకల్ సెంటిమెంట్​ను ప్రధానాస్త్రాలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం కరీంనగర్ మహిళా డిగ్రీ కాలేజీలో ఇదే తరహాలో బండి సంజయ్​హాట్ కామెంట్స్ చేశారు. ‘మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాన్ లోకల్. ఆయన ఏనాడూ కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదు. స్థానిక ప్రజలను కలవలేదు. ఎన్నికలొస్తున్నాయని తెలిసి డ్రామాలాడుతున్నాడు. వినోద్​మాటలను ఎవరూ పట్టించుకోరు. సొంత పార్టీ కార్యకర్తలే ఆయన్ని పట్టించుకోవడం లేదు.’ అని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం బండి కామెంట్లు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. ఇదే స్లోగన్​తో ప్రజల్లోకి వెళితే స్థానికంగా బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. 

కౌంటర్​ అటాక్

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ జెన్ కో సంస్థలో బోయిన్ పల్లి సరితారావు అనే మహిళకు ఏఈ ఉద్యోగం ఇచ్చారని, ఆమె బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్న బిడ్డ అంటూ జనవరి ఫస్ట్ వీక్ లో బీజేపీ సోషల్ మీడియా టీమ్​వైరల్​చేసింది. అదే తరహాలో ఇప్పుడు ‘వరంగల్ జిల్లా ఏనుగుల్లుకు చెందిన వినోద్ కుమార్ కు కరీంనగర్ తో సంబంధమేంటి’ అంటూ ప్రచారం చేస్తోంది. ‘తెలంగాణ రాక ముందు వరంగల్ జిల్లాకే పరిమితమైన వినోద్ కుమార్.. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే కరీంనగర్ లోక్ సభ సీటును ఎంచుకున్నారు’ అంటూ పోస్టులు పెడుతోంది. ఇదే సమయంలో వినోద్ కుమార్ పుట్టింది కరీంనగర్ గడ్డపైనేనని, ఆయన అమ్మమ్మ ఊరు ఇక్కడేనంటూ బీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఎంపీగా వినోద్​తీసుకొచ్చిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ప్రచారం చేస్తున్నారు

కాంగ్రెస్​లోనూ పెరుగుతున్న డిమాండ్

కరీంనగర్​కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు చేయలేదు. లోకల్, నాన్ లోకల్ సెంటిమెంట్ ప్రధానాస్త్రంగా మారితే కాంగ్రెస్ లోనూ ఇదే డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు టికెట్ కోసం ప్రయత్నిస్తున్న హస్తం నేతలంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే. కాంగ్రెస్ పార్టీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతకే టికెట్ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.