కరీంనగర్ జిల్లా : గద్దపాక గ్రామంలో రేషన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అఖిలపక్షం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుకుంటారా..? అంటూ అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్య బద్దంగా గ్రామంలోని సమస్యలను తెలియజేసేందుకు వస్తే పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడం సరికాదంటూ అఖిపక్ష నాయకులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం సరికాదన్నారు. రైతులకు రుణమాఫీ కాలేదని, దళితబంధు, మూడెకరాల భూమి ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలోని చాలామందికి ఇప్పటికీ ఫించన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి రసమయి బాలకిషన్ ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి ఉందని..ప్రశ్నించేందుకు వచ్చిన వారిని కలవనీయకుండా చేయడం సరైన పద్ధతి కాదన్నారు.