లోకల్ పార్టీలదే సౌత్.!..కర్ణాటక తప్ప..

ఈ సారి లోక్‌‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ప్రత్యేకత ఆ రాష్ట్రానిదే. ప్రతి రాష్ట్రంలోనూ భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకని మినహయిస్తే మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల మీదే జాతీయ పార్టీలు ఆధారపడ్డాయి. 28 లోక్‌‌సభ నియోజకవర్గాలున్న కర్ణాటకలోనే బీజేపీ, కాంగ్రెస్–జేడీ(ఎస్) కూటమి మధ్య ముఖాముఖి పోరు నడిచింది. అయితే రూట్ లెవెల్లో కాంగ్రెస్–జేడీ(ఎస్) కార్యకర్తల మధ్య ఉన్న గొడవల ప్రభావం ఈ ఎన్నికలపై పడిందని బెంగళూరు రాజకీయ వర్గాల సమాచారం. రెండు పార్టీల మధ్య గొడవలతో చాలా నియోజకవర్గాల్లో జేడీ(ఎస్) కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌‌కి వ్యతిరేకంగా పనిచేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడులో జాతీయ పార్టీలకు నో ఎంట్రీ

మొదటి నుంచీ ప్రాంతీయ పార్టీల హవాకు వేదికగా నిలిచిన తమిళనాడులో ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. ఈసారి కాంగ్రెస్ ఎం.కె.స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. మరో జాతీయ పార్టీ బీజేపీ, పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. కరుణానిధి వారసత్వం స్టాలిన్‌‌కి రాగా జయలలిత వారసత్వం విషయంలో కాస్తంత అస్పష్టత నెలకొంది. పళనిస్వామి సర్కార్ విజయాలు అంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా జయలలిత హయాంలో జరిగిన మంచి పనులతో అన్నాడీఎంకే–బీజేపీ కూటమి జనం దగ్గరకు వెళ్లింది. అనేక ఏళ్ల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించిన కరుణానిధి, జయలలిత లేకుండా రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే.

కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్

20 నియోజకవర్గాలున్న కేరళలో ఈసారి పాగా వేయాలని బీజేపీ మొదట్లో భావించింది. శబరిమల వివాదం నేపథ్యంలో అయ్యప్ప స్వామి భక్తుల సెంటిమెంట్‌‌ని సీపీఎం నాయకత్వంలోని పినరయ్ విజయన్‌‌ సర్కార్ దెబ్బ తీసిందని, ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే, భక్తుల సెంటిమెంట్లను తాము గౌరవిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పడంతో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పినరయ్ విజయన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న అయ్యప్ప భక్తులు లెఫ్ట్ ఫ్రంట్‌‌ని ఓడించే సత్తా ఉన్న కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా మారారని ట్రెండ్స్ చెబుతున్నాయి. కేరళలో ఎప్పటిలాగే ఈసారి కూడా ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటముల మధ్యే హోరాహోరీ పోరు నడిచింది.

ఆంధ్రప్రదేశ్‌‌లో టీడీపీ వర్సెస్ వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌‌లో అధికారంలో ఉన్న టీడీపీకి, ప్రాంతీయ పార్టీ  వైసీపీకి మధ్య పోరు నడిచింది. బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ నామమాత్రమే. ఆంధ్రప్రదేశ్‌‌కి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మోడీ సర్కార్ మాట తప్పిందన్న ప్రచారం జోరందుకోవడంతో ఆ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేకపోయింది. ఏపీలో మొత్తం 25 నియోజకవర్గాలున్నాయి. మెజారిటీ సీట్లపై టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.

తెలంగాణలో టీఆర్‌‌ఎస్సే

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ హవా 17 ఎంపీ నియోజకవర్గాల్లోనూ కొనసాగిందంటున్నారు. మిత్రపక్షమైన మజ్లిస్‌‌కి హైదరాబాద్ సీటు పోతే, మిగతా 16 సీట్లు తమ ఖాతాలో పడతాయన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారు. ఒకట్రెండు సీట్లు తాము కూడా గెలుచుకోగలమని బీజేపీ, కాంగ్రెస్ అంటున్నాయి.

జాతీయ అంశాల ప్రభావం నిల్

ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనూ జాతీయ అంశాల ప్రభావం ఏమాత్రం లేకపోవడం ఈసారి ఎన్నికల ప్రత్యేకత. ఆయా రాష్ట్రాల అవసరాలే  ప్రయారిటీ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. జనం దగ్గరకు వెళ్లి ఓట్లడిగాయి.

50 సీట్లు ఆశిస్తున్న బీజేపీ

సౌత్​లోని ఐదు రాష్ట్ర్రాల్లో కలిపి మొత్తం 129 సెగ్మెంట్లున్నాయి. ఈసారి ఎన్నికల్లో 50 సెగ్మెంట్లు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్‌‌గా పెట్టుకున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్కార్ వైఫల్యాలు తమకు కలిసొస్తాయని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంది. కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ యెడ్యూరప్ప సుడిగాలి పర్యటనలు చేస్తూ రాష్ట్రం అంతా తిరిగారు. మెజారిటీ ఎంపీలను పార్టీ ఖాతాలో వేయాలని యడ్యూరప్ప ఈ ఎన్నికల్లో సీరియస్‌‌గా పనిచేశారని బెంగళూరు పొలిటికల్ సర్కిల్స్ సమాచారం. తమిళనాడులో మిత్రపక్షమైన అన్నాడీఎంకే అధికారంలో ఉండటంతో కనీసం 10 సీట్లపైన కమలనాథులు ఆశలు పెట్టుకున్నట్లు టాక్​. శబరిమల వివాదం నేపథ్యంలో కనీసం ఐదు సీట్లయినా తమకు వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతనే బీజేపీ గట్టిగా నమ్ముకున్నట్లు తెలిసింది. కేంద్రం ఇచ్చిన నిధులను సరిగా ఉపయోగించుకోలేకపోయారని ప్రచారం చేసి లాభపడటానికి బీజేపీ ప్రయత్నం చేసింది. తెలంగాణలో సికింద్రాబాద్‌‌తో పాటు మరో సెగ్మెంట్‌‌పై కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు.