
నాగ్పూర్ హింస కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగ్పూర్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు, స్థానిక పొలిటికల్ లీడర్ ఫయీమ్ ఖాన్ ను పోలీసులు బుధవారం (మార్చి19)అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 50 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.19 మంది నిందితులను పోలీస్ కస్టడీకి పంపారు. నాగ్పూర్ జిల్లాలో పది పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వ్యవహారంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నాగ్ పూర్ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బృందాలను మోహరించారు. ప్రస్తుతం నాగ్ పూర్ లో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.