స్థానికతపై తుది నిర్ణయం రాష్ట్రాలదే

స్థానికతపై తుది నిర్ణయం రాష్ట్రాలదే
  • నిబంధనలు రూపొందించే హక్కు కూడా..
  • నీట్ కౌన్సెలింగ్ వ్యవహారంపై సుప్రీం విచారణ
  • స్థానికత అంశంపై స్పష్టమైన విధానం ఉండాలని సూచన
  • ఈ నెల 3వ తేదీకి విచారణ వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: స్థానికత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు రూపొందించే హక్కు కూడా రాష్ట్రాలకే ఉందని తెలిపింది. నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంలో దాఖలైన పిటిషన్ పై ఈ మేరకు సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. నీట్‌కు ముందు నాలుగేండ్లు లోకల్ గా చదవాలని, లేదా లోకల్​లో ఉండాలని జీవో 33లోని నిబంధన 3 (ఏ) కింద చేర్చింది. అయితే, ఈ నిబంధనను సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన కల్లూరి నాగ నరసింహా అభిరామ్ తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. విద్యార్థులకు సానుకూలంగా తీర్పు వెలువరించింది. 

ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ... తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గత విచారణ సందర్భంగా ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులు.. కౌన్సెలింగ్ హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో ఈ 135 మంది కౌన్సెలింగ్​కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతో పాటు, హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు సీజేఐతో కూడిన బెంచ్ మధ్యంతర స్టే ఇచ్చింది. అలాగే, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అయితే, సోమవారం మరోసారి ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 

విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... కేవలం హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులను మాత్రమే కౌన్సెలింగ్ కు అనుతించడం సరికాదని తెలిపారు. తెలంగాణకు చెందిన అర్హులందరినీ కౌన్సెలింగ్ కు అనుమతించాలని కోరారు. కేవలం ఒకటి లేదా రెండేండ్లు వేరే చోట చదివినంత మాత్రాన స్థానికులు కాదనడం సరికాదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... మొత్తం ఎంతమంది విద్యార్థులు ఇలా స్థానికత సమస్యను ఎదుర్కొంటున్నారని ప్రశ్నించింది. స్థానికత అంశంపై స్పష్టమైన విధానం ఉండాలని పేర్కొన్నది. నీట్ కౌన్సెలింగ్ లో స్థానికత వ్యవహారంపై అందరికీ వర్తింపజేస్తే ఎలా ఉంటుందనే అంశంపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అక్టోబర్ 3న మరోసారి విచారించి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.