
- స్థానికులకంటే.. స్థానికేతరులకే ప్రాధాన్యం
- తెరవెనుక స్థానిక సర్పంచ్ హస్తం?
- పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని గ్రామస్తుల ఆవేదన
హనుమకొండ, ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో గ్రానైట్ మైనింగ్ కు ప్రభుత్వ భూమిని దొడ్డిదారిన కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని 609 సర్వే నెంబర్లో ఉన్న భూమిలో కలర్ గ్రానైట్నిక్షేపాలున్నాయి. దీంతో శ్రేయ ఎక్స్పోర్ట్ అనే కంపెనీ15 హెక్టార్లు, శ్రీమాన్ రాక్స్ అనే కంపెనీ మరో 15 హెక్టార్టలో మైనింగ్‌కు 2021లో అప్లై చేసుకున్నాయి. ఈ 30 హెక్టార్ల(దాదాపు 75 ఎకరాలు)లో శ్రేయ ఎక్స్ పోర్ట్ కంపెనీ ఏడాదికి 46,080 క్యూబిక్ మీటర్లు, శ్రీమాన్ రాక్స్ ఏడాదికి 47,904 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్ మైనింగ్చేయడానికి 20 ఏండ్ల లీజ్‌కు అప్లికేషన్ పెట్టుకున్నాయి. భారీగా గ్రానైట్ తవ్వకాలు జరపనుండగా.. వీటి పర్మిషన్ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. డప్పుచాటింపు, ఇతర మార్గాల ద్వారా గ్రామస్థులందరికీ సమాచారం అందించాలి. కానీ ప్రజాభిప్రాయ సేకరణ గురించి తమకు సమాచారం అందించనే లేదని గ్రామస్థులు చెబుతున్నారు.
ఊరోళ్ల కంటే బయటోళ్లే ఎక్కువ..
నారాయణగిరిలో కలర్ గ్రానైట్ తవ్వకాల కోసం హనుమకొండ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అధ్యక్షతన గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఉదయం 11 గంటలకు పబ్లిక్ హియరింగ్ స్టార్ట్ కాగా.. దాదాపు 100 మంది వరకు హాజరయ్యారు.. అందులో గ్రామానికి చెందిన వ్యక్తులు పట్టుమని 15 మంది కూడా లేరు. మిగతా వాళ్లలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్జీవోల ప్రతినిధులు, కంపెనీల తరఫున వచ్చిన వాళ్లే ఉండగా.. అక్కడికి వచ్చిన వారితో మూడు గంటల్లోనే పబ్లిక్ హియరింగ్ కంప్లీట్ చేశారు. ఈ అభిప్రాయ సేకరణలో మాట్లాడాలనుకునే వారికి పొల్యూషన్ బోర్డు ఆఫీసర్లే అవకాశం కల్పించాల్సి ఉండగా.. ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులే చిట్టీలు రాసుకొచ్చి, తాము అనుకున్న వారితో మాట్లాడించారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన కొద్దిమంది గ్రామస్థులు మాట్లాడుతూ.. తమకు ఈ విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. మైనింగ్ చేసే ప్రాంతానికి చుట్టుపక్కల ఆరు కుంటలున్నాయని, తవ్వకాల వల్ల వాటికి ప్రమాదం కలుగుతుందన్నారు. వాటిపై ఆధారపడ్డ మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి కోల్పోతాయన్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన ఎన్జీవో ప్రతినిధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ.. క్వారీ వల్ల 50 వేల చెట్లు, మొక్కలకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ కంపెనీల నుంచి 1.8 లక్షల క్యూబిక్ మీటర్ల వేస్టేజ్ వెలువడుతుందని, వీటికి పర్మిషన్ ఇవ్వొద్దని కోరారు. అనంతరం కంపెనీ నిర్వాహకులు మాట్లాడుతూ 500 మొక్కలు నాటుతామని చెప్పగా.. అవి సరిపోవని, మరిన్ని మొక్కలు నాటాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. అనంతరం పీసీబీ ఈఈ సునీత మాట్లాడుతూ ఇక్కడ సేకరించిన ప్రజల అభిప్రాయాలను మినిట్స్ రూపంలో మైనింగ్ మినిస్ట్రీకి పంపిస్తామని, ఆ తర్వాత వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే గ్రామ సమీపంలోని క్వారీలో పేలుళ్ల వల్ల ఇండ్లు, రోడ్లు దెబ్బతింటుడగా.. ఇప్పుడు మరో రెండు కంపెనీలు వస్తే ఇంకా ఇబ్బందులు పెరుగుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో స్థానిక బీఆర్ఎస్ సర్పంచే తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, జిల్లా ఫిషరీస్ సొసైటీస్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. కంపెనీల పర్మిషన్‌కు ప్రజాభిప్రాయ సేకరణ చేపడ్తున్నట్లు గ్రామస్తులకు సమాచారమే ఇవ్వలేదు. గ్రామస్తులు 15 మంది లేరు.