మిస్సింగ్​ సర్వే నంబర్ల తక్లీఫ్​

  •     జగిత్యాల మున్సిపాలిటీ గ్రామాల్లో మిస్సయినసర్వే నంబర్లు 
  •     సర్వే నంబర్లు కనిపించకపోవడంతో నిర్మాణాలకు పర్మిషన్లు రావట్లే..
  •     ఐదేండ్లుగా నిరీక్షిస్తున్న శివారు ప్రాంత జనాలు

జగిత్యాల, వెలుగు : శివారు గ్రామాలను జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేసేటప్పుడు సర్వే నంబర్ల నమోదులో తప్పులు జరిగాయి. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో జరిగిన పొరపాట్లతో స్థానికులు ఇబ్బందులు పడ్తున్నరు. విలీన టైంలో సర్వే చేసిన ఆఫీసర్లు.. రిపోర్టు తయారీలో తప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగానే గెజిట్​విడుదలైంది. ఈ గెజిట్​అమలు వల్ల తమకు మున్సిపాలిటీ నుంచి కొత్త నిర్మాణాలకు పర్మిషన్ రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. తమ ఇబ్బందులు తొలగాలంటే రివైజ్డ్​ గెజిట్​తీసుకురావాలని విలీన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

ఐదేండ్లుగా ఎదురుచూపులే..

2018 లో జగిత్యాల శివారు గ్రామాలను బల్దియాలో విలీనం చేశారు. శంకులపల్లె, గోవిందుపల్లె, టీఆర్ నగర్, లింగంపేట, హస్నాబాద్, ధరూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో సర్వే చేసి పట్టణానికి దగ్గరగా, గ్రామానికి దూరంగా ఉన్న సర్వే నంబర్లను బల్దియాలో విలీనం చేయాలని రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అయితే ఈ రిపోర్టులో పలు తప్పులు దొర్లాయి. సర్వే నంబర్ల వివరాలను స్పష్టంగా రాయలేదు. ఉదాహరణకు మోతె గ్రామంలో సర్వే నంబర్ 33 నుంచి 45 వరకు బల్దియాలో విలీనం చేయాలి. కానీ 33, 42, 43, 45 నంబర్లను మాత్రమే ఎంటర్ చేశారు. సర్వే నంబర్​360 నుంచి 366 వరకు బదులు 360, 366 అని రాశారు. 369 తర్వాత 374 అని రాశారు. 445 తర్వాత 571 సర్వే నంబర్ ఎంటర్ చేశారు. ఇలా చాలా చోట్ల మధ్యలోని సర్వే నంబర్లను వదిలిపెట్టారు. ఇలా ఆర్డర్​మిస్​కావడంతో మధ్యలోని సర్వే నంబర్లున్న భూములు మున్సిపాలిటీలో విలీనం కాలేదు.

పర్మిషన్ కు కష్టాలు

బల్దియా వద్దనున్న  డేటాలో కొన్ని నంబర్లు మిస్​కావడంతో ఇండ్లు, ఇతర నిర్మాణాలకు పర్మిషన్​రావడం లేదు. మరోవైపు మిస్​అయిన నంబర్లు రిజిస్ట్రేషన్​శాఖ గెజిట్‌‌లో ఉండడంతో ల్యాండ్​రిజిస్ట్రేషన్ ​టైంలో ఆ శాఖ మ్యూటేషన్‌‌, ఇతర చార్జీలు వసూలు చేస్తోంది. బల్దియా ఆఫీసర్లు మాత్రం టీఎస్‌‌బీపాస్​ వెబ్‌‌సైట్‌‌లో సదరు సర్వే నంబర్లు చూపించడం లేదని చేతులెత్తేస్తున్నారు. చేసేదేమీ లేక చాలామంది జీపీ నుంచే పర్మిషన్ తీసుకుంటున్నారు. దీంతో బల్దియా ఆదాయానికి గండి పడుతోంది. కొందరు రియల్టర్లు దీన్ని ఆసరాగా చేసుకుని ఈ మిస్ అయిన సర్వేనంబర్లలో జీపీ పర్మిషన్లతో దందా చేస్తున్నారు. 

మరో గెజిట్ వస్తేనే పరిష్కారం 

గెజిట్‌‌లో మిస్సయిన సర్వే నంబర్లు బల్దియా పరిధిలోకి వచ్చేలా ఓ నివేదికను రూపొందించిన ఆఫీసర్లు ఏడాది కింద 2022 జనవరిలో సీడీఎంఏకు అందజేశారు. దీనిపై గెజిట్ వస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే చాన్స్ ఉంది. సీడీఎంఏకు పంపిన తర్వాత ఫాలో అప్ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కొత్త గెజిట్ విడుదలలో జాప్యం జరుగుతోంది. 2022 సెప్టెంబర్ 19న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మిస్సింగ్ సర్వే నంబర్ల పై కొత్త గెజిట్ కోసం రివైజ్డ్ ప్రపోజల్స్ ఆమోదించాలని కోరుతూ మినిస్టర్ కేటీఆర్ కు లెటర్ పంపించారు. ఏడాదైనా 
కొత్త గెజిట్ విడుదల చేయలేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.