- 100కు డయల్ చేసినా స్పందించని పోలీసులు
- వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన
వర్ధన్నపేట, వెలుగు: మహిళ మెడలోని పుస్తెలతాడు లాగేందుకు యత్నించగా ఇద్దరు యువకులను పట్టుకుని చితకబాదిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వర్ధన్నపేటలోని భారతీయ టాకీస్ సమీపంలో రేషన్ డీలర్ చెన్న శ్రీధర్ ఇంట్లోకి శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకులు చొరబడ్డారు. శ్రీధర్ భార్య మెడలోని పుస్తెలతాడును లాగేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో పారిపోవడానికి ప్రయత్నించారు. ఒక యువకుడిని పట్టుకొని చితకబాదారు.
మరో యువకుడు కూడా వచ్చి లొంగిపోయాడు. స్థానికులు నిలదీయడంతో వర్ధన్నపేటకు బంధువుల ఇంటికి దీపావళి పండుగకు హైదరాబాద్ నుంచి వచ్చామని తెలిపారు. ఆ వ్యక్తిని పిలిపించి అడగగా వాళ్లు తమ బంధువులేనని ఒప్పుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే బాధితులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదని గ్రామస్తులు అసహనం వ్యక్తంచేశారు.
ఇది కాస్త వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి కేసు పూర్తి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు . ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు వచ్చి విచారణ జరిపి వివరాలు తీసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.