మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా.. అడ్డుకున్న స్థానికులు

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులోని మానేరు వాగు నుంచి యథేచ్చగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు వ్యతిరేకంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ లారీలను అడ్డుకున్నారు. ఇప్పటికే ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించినా,  సుప్రీంకోర్టు కూడా అదే చెప్పినా.. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 

చెక్ డ్యాం దగ్గర డిసిల్టేషన్ పేరిట మానేరు ఇసుక మైనింగ్ చేయడం పట్ల స్థానికులు ఇప్పటికీ ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాణిజ్య అవసరాలకు ఇసుక ఎలా తీసుకెళ్తారంటూ గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఇసుక రీచుల్లో పని చేస్తున్న వారికి,  గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇసుక రవాణాను అడ్డుకునే అధికారం మీకు లేదంటూ ఇసుక తరలిస్తున్న వారు వాదించారు. మానేరు నదిలో మైనింగ్ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.