పాకిస్తాన్‎లో అంతే:ఫేక్ కాల్ సెంటర్ నుంచి కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ ఎత్తుకెళ్లిన స్థానికులు

పాకిస్తాన్‎లో అంతే:ఫేక్ కాల్ సెంటర్ నుంచి కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ ఎత్తుకెళ్లిన స్థానికులు

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‎లో జరిగిన ఓ లూటీ సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఒక్కసారిగా ఓ కాల్ సెంటర్లోకి దూసుకెళ్లిన స్థానికులు.. క్షణాల్లోనే ఆఫీసును గుల్లా చేశారు. కాల్ సెంటర్లోని ల్యాప్ ట్యాప్‎లు, కంప్యూటర్లు ఎవరికి దొరికినవి వారు ఎత్తుకెళ్లారు. ప్రజలు కాల్ సెంటర్లోని వస్తువులను దోచుకెళ్తుండగా కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ సాధిస్తుండగా.. మరికొందరు ఫన్నీ కామెంట్లతో పాక్ పరువు తీస్తున్నారు.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ సెక్టార్ F-11లో చైనా జాతీయులు ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ  కాల్ సెంటర్ ద్వారా అంతర్జాతీయ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాక్ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన చైనీయులు వివిధ దేశాలలో వేల సంఖ్యలో అమాయకులను మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) రంగంలోకి కాల్ సెంటర్లో సోదాలు చేపట్టింది. 

ALSO READ | ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. గాజాలో శవాల కుప్పలు.. 200 మందికి పైగా మృతి

ఎఫ్ఐఏ తనిఖీలు నిర్వహించి.. ఇలా బయటకు వెళ్లిందో లేదో.. స్థానికులు ఒక్కసారిగా ఆ కాల్ సెంటర్లోకి దూరారు. అక్కడ కనిపించిన ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్‌టెన్షన్ కేబుల్స్, టేబుల్‌వేర్, ఫర్నిషింగ్‌లను అందినకాడికి దోచుకున్నారు. గొడవ పడి మరీ స్థానికులు వస్తువులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‎తో రెచ్చిపోయారు. 

‘‘క్రిప్టోలో పెట్టుబడి పెట్టడం కంటే వ్యాపారం ప్రారంభించడం ప్రమాదకరం అనే ఏకైక దేశం పాకిస్తాన్" అని ఓ నెటిజన్ అనగా.. ‘‘చైనా మొత్తం పాకిస్తాన్‌ను దోచుకుంది. పాకిస్తానీయులు చైనాలోని కొన్ని కంప్యూటర్లు, ప్రింటర్లను దోచుకున్నారంతే” అని కామెంట్ చేశాడు. అయితే.. దాయాది పాకిస్థాన్ దేశంలో ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. గత సెప్టెంబర్‌లో కరాచీలో కొత్తగా ప్రారంభించబడిన మాల్‌లోకి ఒకేసారి వందలాది మంది చొరబడి దుస్తులు, ఇతర వస్తువులు దొంగలించారు.