200 ఫీట్లు వద్దు.. 100 ఫీట్లు చాలు

  • ఎలివేటెడ్​ కారిడార్ సర్వీసు రోడ్డు విస్తరణపై స్థానికుల అభ్యంతరాలు
  • ఆస్తులను కూల్చివేసేందుకు ఇప్పటికే  మార్కింగ్ చేసిన అధికారులు 
  • రోడ్డు విస్తరణతో ఇండ్లు, ఉపాధి కోల్పోతామంటున్న బాధితులు 

కంటోన్మెంట్, వెలుగు : సికింద్రాబాద్​– శామీర్​పేట్ ఎలివేటెడ్​కారిడార్ నిర్మాణంలో భాగంగా సర్వీసు రోడ్డు విస్తరణపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. సర్వీసు రోడ్డును 200 ఫీట్లకు విస్తరించాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే.. 100 ఫీట్లకు విస్తరణ పరిమితం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

200 ఫీట్లకు చేస్తే.. కార్ఖానా ఏరియాలో దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో ఇండ్లు, షాపింగ్​కాంప్లెక్స్ లు, ఇతర విలువైన ఆస్తులు నష్టపోతామని పేర్కొంటున్నారు. ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి ప్రస్తుతం ఉన్న100 ఫీట్ల రోడ్డు సరిపోతుందంటున్నారు. కొత్తగా రోడ్డు విస్తరణ అవసరం లేదంటున్నారు. 

2014లో స్కైవేల నిర్మాణానికి ప్రతిపాదనలు 

కరీంనగర్ స్టేట్​హైవే, నాగపూర్​నేషనల్ హై వేను అనుసంధానిస్తూ రెండు స్కైవేలు నిర్మించాలని 2014లో తొలిసారిగా గత సర్కార్ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్యారడైజ్ జంక్షన్​– బోయిన్​పల్లి – సుచిత్ర వరకు హైవేపై, జింఖానా గ్రౌండ్స్ –  హకీంపేట ఎయిర్​ఫోర్స్​స్టేషన్​ మీదుగా శామీర్​పేట్​వరకు నేషనల్ హై పై స్కైవేలను నిర్మిస్తే సిటీ నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తొలగుతాయి. అయితే..  రెండు హై వేలకు ఇరువైపులా పలు చోట్ల రక్షణ శాఖ స్థలాలు ఉండడంతో రాష్ర్ట ప్రభుత్వం  స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది.

రెండు రూట్లలో కలిపి150 ఎకరాల  వరకు రక్షణ స్థలాలు అవసరమవుతాయని గుర్తించింది.  దీనిపై పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల మధ్య  చర్చలు కూడా జరిగాయి. చివరకు స్కైవేల నిర్మాణాలకు కావల్సిన  స్థలాలు ఇచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించి హెచ్ఎండీఏకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. దీంతో రూ.2, 232 కోట్ల నిధులతో 6 లైన్ల ఎలివేటెడ్​ కారిడార్ ను నిర్మించేందుకు గత మార్చి 7న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి భూమి పూజ చేశారు. 

5  నుంచి 20 మీటర్ల మేర మార్కింగ్

ఇప్పటికే సర్వీసు రోడ్డు విస్తరణకు అధికారులు కార్ఖానా ఏరియాలో భూ సేకరణకు సుమారు 5 మీటర్ల నుంచి 20 మీటర్ల మేర స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు  మార్కింగ్​చేశారు.  దీంతో రోడ్డుకు ఇరువైపులా ఇండ్లతో పాటు  కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉండగా.. కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుంది. 200 ఫీట్లకు రోడ్డు విస్తరణ చేస్తే.. తాము ఆస్తులతో పాటు ఆర్థికంగా కూడా చాలా నష్టపోతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీవీఎన్​ఆర్​ఎక్స్‌ప్రెస్‌వే కూడా 100 అడుగుల విస్తరణతోనే  ఉందని, ఈ మార్గంలో కూడా అలాగే చేస్తే సరిపోతుందంటున్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు. ఇటీవల ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌సెక్రటరీ దానకిషోర్‌ను కూడా కలిసి తమ సమస్యను విన్నవించారు.

ఉన్న రోడ్డునే మంచి చేస్తే చాలు

 సర్వీసు రోడ్డును 200 ఫీట్లకు పెంచడం ద్వారా కార్ఖానా ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోతారు. రోడ్డు విస్తరణ చేపట్టవద్దు. ప్రస్తుతమున్న100  ఫీట్ల రోడ్డునే మంచిగా చేస్తే బాగుంటుంది.  
– తేలుకుంట సతీశ్​గుప్తా, సోషల్ వర్కర్​

తీవ్రంగా నష్టపోతాం
 
సర్వీసు రోడ్డు  విస్తరణ అవసరం లేదు. ఒక వేళ చేస్తే 100 అడుగులు చాలు. చాలా మందికి ఇండ్లు, షాపులు ఉండగా.. వాటిని అద్దెలకు ఇచ్చి ఆదాయం పొందుతూ జీవిస్తున్నారు.  రోడ్డు విస్తరణ చేస్తే తీవ్రంగా నష్టపోతాం.   
- శ్రీనివాస్​రావు, కార్ఖానా