ఇథనాల్​ వద్దే వద్దు.. మైసమ్మ తల్లి ఫ్యాక్టరీ రాకుండ చూడమ్మా..!

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామలో స్థంబంపల్లి వద్ద  నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ చేయాలంటూ  గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. డప్పు,చప్పుళ్లతో మైసమ్మకు తల్లికి  బోనాలు సమర్పించారు. ఇథనాల్​ప్రాజెక్టు రద్దయ్యేలా చూడాలని మైసమ్మకు మొక్కుకున్నారు.గ్రామస్తులతోపాటు, పొరుగు గ్రామాల ప్రజలు ప్రాజెక్ట్ నిర్మించే స్థలం వద్దకు వెళ్ళకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. గ్రామస్తులను కలిసేందుకు వచ్చిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పోలీసులు అడ్డుకోని, తిరిగి వెనక్కి పంపారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో తమ గ్రామాలకు ముప్పు పొంచివుందని,ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని ఇప్పటికే నాలుగు గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి.

 ఈ సందర్భంగా ఓ మహిళకు పూనకం వచ్చి ‘ఇక్కడ ప్రాజెక్టు పడితే గ్రామస్తులందరూ ఇబ్బందులు పడుతరు’ అని భవిష్యవాణి చెప్పింది. ఈ క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత గ్రామస్తులందరూ వంటలు వండుకొని భోజనాలు చేసి తిరిగి ఇండ్లకు వెళ్లారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.

జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 1090 లో  ఇథనాల్ ప్యాక్టరి నిర్మాణం జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఇక్కడ  ప్రాజెక్టు నిర్మాణం జరిగితే  ఇక్కడి ప్రాంతమంత కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటుందని స్థంభంపల్లి, పాశిగామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ప్రాజెక్టు నిర్మాణాన్ని జరగనివ్వమని తెగేసి చెప్తున్నారు. కాగా అక్కడి ప్రాంతాన్ని చదును చేసేందుకోసం  నిర్వాహకులు పనులు ప్రారంభించారు.విషయం తెలుసుకున్న పాసిగామ ప్రజలు భారీగా తరలివచ్చి పనులను  అడ్డుకున్నారు. అదే విధంగా ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన  సీసీ కెమెరాల వలన మహిళ లు ఇబ్బంది పాడాల్సి వస్తుందని వాటిని తొలగించాలని కోరారు. రెండు గంటల పాటు సాగిన ఆందోళన కార్యక్రమం లో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.