స్థానికులమైన మాకు ఉద్యోగాలియ్యరా?

స్థానికులమైన మాకు ఉద్యోగాలియ్యరా?

కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఔట్​సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో 10 ఏండ్లుగా సేవ చేస్తున్న స్థానికులమైన తమను కాదని కొత్తవారిని నియమించారంటూ ఈవో ఆఫీసులో కొందరు గురువారం నిరసన తెలిపారు. కొమురవెల్లికి చెందిన వడ్లకొండ రజనీకాంత్, బత్తిని నాగరాజు, కడెం రజిత, అయినాపూర్ రేణుక మాట్లాడుతూ పదేండ్లుగా మల్లన్న జాతర టైంలో వలంటీర్లుగా పనిచేస్తూ మిగతా టైంలో టెంపుల్​లో ఉచితంగా సేవలు చేస్తున్నామన్నారు. అన్ని అర్హతలున్న తమను ఔట్​సోర్సింగ్ సిబ్బందిగా నియమించకుండా అర్హత లేని వారిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవో బాలాజీ, టెంపుల్ చైర్మన్ గీస భిక్షపతి న్యాయం చేయాలని లేకపోతే ఆందోళన చేస్తామనిహెచ్చరించారు. 

ఇదే క్రమంలో టెంపుల్ లో పనిచేసి చనిపోయిన బత్తిని పొశయ్య భార్య బాలమణికి పింఛన్ రాకుండా చైర్మన్ గీస భిక్షపతి అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపించగా.. ఈవో ఆ ఫైల్ ను తెప్పించుకుని చూశారు. త్వరలోనే బెనిఫిట్స్ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఔట్​ సోర్సింగ్ సిబ్బంది నియామకాలపై ఈవో బాలాజీని వివరణ కోరగా కొన్ని రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు చేయాల్సి వస్తున్నదన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచనతోనే నియమకాలు చేశామని, తామేం చేస్తామని చైర్మన్​ భిక్షపతి స్పష్టం చేశారు. కాగా, ఆందోళనకారులు మొదట పెట్రోల్​డబ్బాలతో నిరసన తెలపగా సిబ్బంది లాక్కొని దాచినట్లు తెలిసింది.