![బ్రిడ్జి కట్టాలని సరళాసాగర్ వాగుపై స్థానికుల ధర్నా](https://static.v6velugu.com/uploads/2022/10/locals-protest-at-sarala-sagar-project-for-bridge_9R2sDUvjPi.jpg)
- 8 ఏండ్లుగా ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే
- ఆరు గంటలపాటు కొనసాగిన నిరసనలు
- శనివారం గల్లంతైన ముగ్గురు మృతి.. మృతదేహాల వెలికితీత
వనపర్తి, వెలుగు: సరళాసాగర్ వాగుపై బ్రిడ్జి కట్టకుండా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తమకు వద్దంటూ జనం ఆందోళనకు దిగారు. వరదలు వచ్చి వరుసగా ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. శనివారం వనపర్తి జిల్లా మదనాపురంలోని సరళాసాగర్ వాగును బైక్‌పై దాటుతుండగా ముగ్గురు గల్లంతై మరణించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆత్మకూరు, వనపర్తి ప్రధా న రహదారిపై మృతుల కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజలు, పలు పార్టీల నేతలు ధర్నాకు దిగా రు. దాదాపు 6గంటలు నిరసన తెలిపారు. బ్రిడ్జి నిర్మించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు స్పందించడం లేదంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించారు.
తరచూ ప్రమాదాలు
తెలంగాణ ఏర్పాటు కాకముందే సరళాసాగర్ వాగు పై బ్రిడ్జి నిర్మించేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. తర్వాత మరోసారి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినా, బ్రిడ్జి నిర్మించలేదు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎగువన ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టుతో పాటు శంకర సముద్రం రిజర్వాయర్ నుంచి ఒక్క సారిగా వరద వస్తుండడంతో ఈ రోడ్డుపై నుంచి వరద నీరు పారుతున్నది. అప్పటికే మూడు రోజులుగా వరద కారణంగా రోడ్డును పోలీసులు మూసేశారు. సాయంత్రం మూడు గంటలకు ఉధృతి తగ్గడంతో పెద్ద వాహనాలను అనుమతించారు. ఈ సమయంలో చిన్న వాహనాలు కూడా వెళ్తుండటంతో కొత్తకోటకు చెందిన బొల్లి సాయికుమార్ (19), అతడి చిన్నమ్మ చెన్నమ్మ అలియాస్ సంతోష (30), ఆమె కూతురు పరిమళ (18) బైక్‌పై వాగు దాటేందుకు ప్రయత్నించారు. కానీ మధ్యలోకి రాగానే కొట్టుకుపోయారు. వారి కోసం గజ ఈత గాళ్లు, హైదరాబాద్ నుంచి వచ్చిన రెస్క్యూ టీం కలిసి గాలించారు. దిగువన ఉన్న రామన్ పాడు రిజర్వాయర్‌లో ఆదివారం ఒంటి గంట ప్రాంతంలో మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు.
బాధితులను ఆదుకుంటం: ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి.. ఆదివారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదుతో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు, దళిత బంధు అందిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 6న రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కురుమూర్తి కుటుంబానికి కూడా ఈ సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే ఇసుక దందా: నేతల ఆరోపణ
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.. దేవరకద్ర నియోజకవర్గంలో 20కి పైగా చెక్ డ్యాంలు నిర్మించి ఇసుక, మట్టి దందాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. సరళాసాగర్ వాగు వద్ద ఇసుక లేదన్న కారణంతోనే బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని మండి పడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.