మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని బోడుప్పల్ ప్రధాన రహదారిపై జనావాసాలు, విద్యాసంస్థల మధ్యలో ఏర్పాటు చేసిన వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు, మహిళలు, పీర్జాదిగూడ బీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అపార్ట్మెంట్, విద్యాసంస్థలు, కాలనీల మధ్య వైన్స్ ఏర్పాటు చేయడంతో ఇండ్ల నుంచి మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారన్నారు. నెల రోజులుగా ఎక్సైజ్ అధికారులకు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. ధర్నాలో స్థానికులు, పీర్జాదిగూడ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.