
- గత ప్రభుత్వం హామీ ఇచ్చి మోసగించింది
- క్రాంగెస్ ప్రభుత్వమైనా డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్టలో బస్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బస్ డిపో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానికులు ధర్నాకు దిగారు. గత ప్రభుత్వం డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. ఎన్నికల టైంలో అప్పటి మంత్రి కేటీఆర్, ప్రస్తుత ఎమ్మెల్యే వివేకానంద హామీలతో మభ్యపెట్టారన్నారు. ఏండ్లు గడుస్తున్నా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట ప్రాంతంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు ఉంటున్నారని, రాత్రి పూట రోజూ సుమారు 40 బస్సులు బస చేస్తున్నాయన్నారు. బస్సుల పార్కింగ్ కు స్థలం లేక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.
డ్రైవర్లు, కండక్టర్లకు కనీస అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగద్గిరిగుట్టలో కోట్లాది విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో బస్‌డిపో నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా బస్‌డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు ఆకుల సతీశ్, జయశంకర్, ఆంజనేయులు, అమలేశ్వరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.