తమిళనాడు మంత్రిపై బురద జల్లిన వరద బాధితులు
విల్లుపురం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతానికి వెళ్లినపుడు ఘటన
చెన్నై: తమిళనాడు మంత్రి తిరు పోన్ ముడికి చేదు అనుభవం ఎదురైంది. విల్లుపురం జిల్లా ఇరువేల్పట్టులో మంగళవారం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లినపుడు మంత్రిపై వారు బురద చల్లి నిరసన వ్యక్తం చేశారు. వరదలతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ఇప్పటికీ తమకు సహాయం అందలేదని బాధితులు మండిపడ్డారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మమ్మల్ని సందర్శించడానికి వచ్చినపుడు కూడా మంత్రి చాలాసేపు తన కారులోనే కూర్చున్నారు. ఎంతకీ కారు దిగడం లేదు.
దీంతో ఆయనపై బురద చల్లాల్సి వచ్చింది” అని బాధితులు వాపోయారు. ఈ ఘటన జరిగినపుడు మంత్రి వెంట ఆయన కొడుకు కూడా ఉన్నాడు. కాగా.. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి మంత్రిపై బురద చల్లిన ఘటనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం తమిళనాడులో ఇదీ పరిస్థితి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే.. సీఎం స్టాలిన్ చెన్నై వీధుల్లో ఫొటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. చెన్నైలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా ఆయన ఇక్కడే ఉంటున్నారు” అని అన్నామలై విమర్శించారు.
బాధిత కుటుంబాలకు చెరో రూ.2 వేల సాయం
ఫెయింజల్ తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన విల్లుపురం, కడలూరు, కళ్లాకురిచి జిల్లాల్లో వరద బాధిత కుటుంబాలకు సీఎం స్టాలిన్ రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గుడిసెలు డ్యామేజ్ అయిన వారికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. కాగా, తమిళనాడులో వచ్చిన వరదల గురించి సీఎం స్టాలిన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. మంగళవారం స్టాలిన్ కు మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం తరపున అవసరమైన సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యకర్తలకు రాహుల్ పిలుపు
తమిళనాడును ఫెయింజల్ తుఫాను అతలాకుతలం చేసిందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అధికారులు చేపడుతున్న సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఒకే ఫ్యామిలీలో ఏడుగురు మృతి
ఫెయింజల్ తుఫానుతో తిరువణ్ణామలై అతలాకుతలమైంది. ఇక్కడ పావల కుండ్రు ఏరియాలో ఓ కొండపై నుంచి వరద నీళ్లు ప్రమాదకర స్థాయిలో కొట్టుకువచ్చాయి. మార్గం మధ్యలో ఉన్న రాళ్లూరప్పలు, మట్టి వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. సమీపంలోని పలు ఇండ్లలోనూ వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వరద కొట్టుకువస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా.. ఇదే ప్రాంతంలో ఆదివారం కొండపై నుంచి బండరాయి దొర్లిపడడంతో ఒకే కుటుంబంలో ఏడుగురు చనిపోయారు.