చౌటుప్పల్లో హరీష్ రావు స్టిక్కర్‭తో ఉన్న వాహనం అడ్డగింత

మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‭లో మంత్రి హరీష్ రావు స్టిక్కర్‭తో ఉన్న వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్‭కు చెందిన కార్యకర్తలు వాహనంలో ఉండటంతో వారు నిలదీశారు. తాము సంగారెడ్డి నుంచి టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి వచ్చామని.. వాహనంలో ఉన్న కార్యకర్తలు చెప్పారు. ఎన్నిక ఉండటంతో ఇక్కడే ఉన్నట్లు వారు తెలిపారు. దీంతో ఈసీ నియమాలు టీఆర్ఎస్ వాళ్లకు వర్తించవా అని స్థానికులు ప్రశ్నించారు. మంత్రి హరీష్ స్టిక్కర్‭తో ఉన్న ఇన్నోవాలో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచేందుకు వచ్చారని స్థానికులు మండిపడ్డారు. 

వాహనంలో ఉన్న కార్యకర్తల్ని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. వాహనాన్ని పంపే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకోవటంతో.. వాళ్లను తోసేసి వెహికిల్‭తో పాటు, టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలను చౌటుప్పల్ పీఎస్‭కు తరలించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్నారని విమర్శించారు.