- నిర్మాణ సమయంలో అన్నారం డిజైన్ చేంజ్
- హై లెవెల్ కమిటీ జోక్యం వల్లే మార్పులు
- డిజైన్లపై స్టడీ జరుగుతుండగానే నిర్మాణ పనులు మొదలు
- కమిషన్ ప్రశ్నలకు ఇద్దరు ఇంజినీర్ల గందరగోళ సమాధానాలు
- ఐదుగురు ఇంజినీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన కాళేశ్వరం కమిషన్
హైదరాబాద్, వెలుగు: అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశాలు మారినట్టు ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు కాళేశ్వరం కమిషన్ ముందు తేల్చి చెప్పారు. డీపీఆర్తర్వాత లొకేషన్లు మారినట్టు స్పష్టంచేశారు. ఇక అన్నారం బ్యారేజీ నిర్మాణ టైంలో ముందు ఖరారు చేసిన డిజైన్ ను పూర్తిగా మార్చినట్టు, అసలు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించకుండానే డిజైన్లు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. హై లెవెల్ కమిటీ జోక్యం వల్లే మార్పులు జరిగాయని తెలిపారు.మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టులో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్‌లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఐదుగురు ఇంజినీర్లను ప్రశ్నించింది.
గతంలో అఫిడవిట్లు దాఖలు చేసిన సీడీవోకు చెందిన రిటైర్డ్ ఎస్ఈలు, ఈఈలు కమిషన్ ముందు హాజరయ్యారు. బ్యారేజీలకు సంబంధించిన డిజైన్ల ఆమోదానికి ముందు అనుసరించిన నిబంధనలు, ఆమోదం తర్వాత మార్పులు, -చేర్పులు, హై లెవెల్ సిఫారసులు, లొకేషన్స్ తదితరాల గురించి జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లను ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు ఇద్దరు ఇంజినీర్లు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై జస్టిస్ ఘోష్అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందుగా సీడీవో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే నరేందర్‌ను ప్రశ్నించింది.
హై పవర్ కమిటీ నిర్ణయం మేరకే డిజైన్స్ డ్రాయింగ్స్ ఖరారు అయ్యాయాని అడగగా.. దీనికి ఆయన అవునని, ఆ నిర్ణయం మేరకే ప్రాణహిత– చేవెళ్ల నుంచి కాళేశ్వరానికి రీడిజైన్ చేసినట్టు చెప్పారు. హై పవర్ కమిటీలో సీడీవో నుంచి సభ్యులు ఉన్నారా? అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చారు. డిజైన్స్, డ్రాయింగ్స్ హై పవర్ కమిటీ ఫైనల్చేసిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్స్, డ్రాయింగ్స్ కు ముందు ఫీల్డ్ చూశారా? అన్ని ప్రశ్నించగా.. లేదు అని సమాధానం చెప్పారు. ఇక డిజైన్తయారు చేసే ముందు సైట్విజిట్కచ్చితంగా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.
క్షేత్రస్థాయి అధికారుల సమాచారం ఆధారంగా డిజైన్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ డిజైన్లలో లోపాలు లేవని, 100 శాతం ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్) కోడ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) లోబడి ఎల్ అండ్ టీ, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో తయారుచేసిందని కాళేశ్వరం ఎస్ఈ, పూర్వ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) హెచ్.బస్వరాజ్ చెప్పారు. డిజైన్లు/డ్రాయింగులు పూర్తిగా ప్రమాణాలకు లోబడి ఉన్నాయని గుర్తించాకే, వాటిని ఆమోదించామన్నారు. బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత డిజైన్లు సిద్ధం చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. స్థలాన్ని పరిశీలించలేదని, క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని బదులిచ్చారు.
బ్యారేజీల మార్పు నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ నిర్ణయం రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తీసుకున్నదేనని బదులిచ్చారు. ‘‘అన్నారం, సుందిళ్ల నిర్మాణ ప్రదేశాలను మార్చారు కదా?.. అలాగే మేడిగడ్డను కూడా మార్చారా?’’ అని కమిషన్ ఆరా తీయగా.. అన్నారం, సుందిళ్లను మార్చినప్పటికీ ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశంలోనే మేడిగడ్డను కట్టారని గుర్తు చేశారు. బ్యారేజీల వైఫల్యానికి డిజైన్లు కారణమా? అని కమిషన్ ప్రశ్నించగా.. డిజైన్లు 100 శాతం కచ్చితత్వంతోనే ఉన్నాయని, వైఫల్యానికి డిజైన్లు ఎంత మాత్రం కారణం కాదని బస్వరాజ్ బదులిచ్చారు. మేడిగడ్డ కుంగిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించామని, అస్ట్రమ్, డౌన్హీమ్ కటాఫ్‌లు దెబ్బతిన్నట్టు గుర్తించామన్నారు.
ఇసుకంతా జారింది: సీడీవో ఎస్ఈ
మోడల్స్టడీస్తర్వాతే నిర్మాణాలు మొదలుపెట్టాల్సిందని సీడీవో ఎస్ఈ ఎం. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్ లపై జస్టిస్ పీసీ ఘోష్ ఆయనను ప్రశ్నించారు. ఓ సమస్య వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందని కమిషన్ ముందు చెప్పారు. పునాది కింద ఇసుకంతా జారిందని, దీంతో సీకెంట్ఫైల్స్కదిలి మేడిగడ్డ బ్యారేజీలో సమస్య వచ్చిందని ఆయన వివరించారు.
బ్యారేజీని డ్యామ్‌లుగా మార్చొచ్చా?
బ్యారేజీలను డ్యామ్‌లుగా మార్చే అంశంలో రామగుండం సీఈ లేఖ విషయమై సీఈ దయాకర్‌రెడ్డి స్పష్టత లేని సమాధానం ఇచ్చారు. అఫిడవిట్‌లోని అంశాలకు భిన్నంగా సమాధానాలు చెప్పడాన్ని కూడా ప్రశ్నించారు. రామగుండం సీఈ బ్యారేజీలను వాటర్ స్టోర్ డ్యామ్‌లుగా మార్చాలని 2021 ఫిబ్రవరి 26 న లెటర్ రాసినట్టు దయాకర్‌రెడ్డి ఆఫిడవిట్లో పేర్కొన్నారు. దీనిని మీరు అంగీకరిస్తున్నారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆయన ఏం సమాధానం చెప్పలేకపోయారు.
ఆ తర్వాత ఆ లేఖ విషయాన్ని మాత్రమే తాను అఫిడవిట్లో చెప్పదలుచుకున్నానని, డ్యామ్‌లుగా మార్చేందుకు అవకాశం ఉన్నదనేది తాను అంగీకరించినట్టు కాదని వివరించారు. కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో మరో రిటైర్డ్ ఇంజినీర్ తరిగొప్పుల రాజేశ్వర్ కూడా పాల్గొన్నారు.