
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని తరగతి గదులకు మంగళవారం తాళం వేసి ఉండడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వంలో జిల్లాకు గవర్నమెంట్మెడికల్కాలేజీ మంజూరు కాగా, సొంత భవనం లేకపోవడంతో ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లిలోని భారత్ ఇన్స్టిట్యూట్స్కాలేజీలో తాత్కాలికంగా అద్దె ప్రాతిపాదికన కొనసాగుతోంది.
మంగళవారం ఉదయం హఠాత్తుగా భారత్కాలేజీ యాజమాన్యం.. మెడికల్ కాలేజీ బిల్డింగ్‌లోని తరగతులకు తాళం వేసింది. మెడికల్ కళాశాల బోర్డులను కూడా తొలగించారు. దీంతో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి అక్కడికి చేరుకొని సదరు కాలేజీ యాజమాన్యంతో చర్చించి, తాళాలు తీయించారు.
అసలు తాళాలు ఎందుకు వేశారని మెడికల్‌కాలేజీ అధ్యాపక బృందాన్ని, అధికారులు, భారత్కాలేజీ యాజమాన్యాన్ని వివరణ కోరగా, స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తనిఖీలు ఉన్నందునే తాళలు వేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, అద్దె బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో తాళాలు వేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.