రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల తీవ్రత తగ్గించడం కోసం మే 8 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. అదేవిధంగా వారాంతాల్లో సెమీ లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయన్ తెలిపారు.
కేరళలో తాజాగా 41,953 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 17,43,932కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. ఇక కరోనా పాజిటివిటీ రేటులో స్వల్ప తగ్గుదల నమోదైంది. రాష్ట్రంలో టెస్ట్ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని విజయన్ తెలిపారు. కాగా.. కరోనా నియంత్రణ కోసం ఇప్పటికే చాలా రాష్ట్రాలు పాక్షికంగా లాక్‌డౌన్‌లు విధించాయి. వాటి దారిలోనే కేరళ కూడా లాక్‌డౌన్ ప్రకటించింది.