తమిళనాడులో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

తమిళనాడులో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

చెన్నై: కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో తమిళనాడు సర్కారు అప్రమత్తమైంది. ఆంక్షలు మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు చెప్పారు. ఆదివారం పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టేక్ అవే సర్వీస్ అందించేందుకు రెస్టారెంట్లకు పర్మిషన్ ఇచ్చారు. కరోనా పిల్లలపై కూడా ప్రభావం చూపే అవకాశముండటంతో ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు కేవలం ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని, 10, 12 తరగతుల వారికి మాత్రమే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

పండుగల సీజన్లో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముండటంతో తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పొంగల్ పండుగకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. బస్సులు, సబర్బన్ ట్రైన్లు, మెట్రో సర్వీసులు కేవలం 50శాతం సీటింగ్ కెపాసిటీతో నడుస్తాయని ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించమని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.