
తాళం వేసిన ఇళ్లే అతని టార్గెట్.. పట్ట పగలే అందరూ తిరుగుతుండగా కళ్లుగప్పి ఇళ్లలో చేరీ చేయడం ఆ దొంగ స్పెషల్. పది పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదైన ఆ అంతర్రాష్ట్ర దొంగను పెద్దపల్లి పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
పెద్దపల్లి జిల్లా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లిలో శాంతమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో దొంగతనం జరిగింది. శాంతమ్మ తన కోడలితో కలిసి అదే కాలనీలో జరుగుతున్న పెళ్లికి వెళ్లింది.
ALSO READ | హనుమాస్ పల్లి ఎర్త్ సెంటర్లో అరుదైన కప్ప
మలహర్రావు మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపత్ అనే పాత నేరస్థుడు వృద్ధురాలి ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డాడు. బీరువా పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం తో పాటు నగదును అపహరించాడు. శాంతమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి నిందితుడు సంపత్ అదుపులోకి తీసుకున్నారు.
నేరస్తుడు సంపత్ నుంచి15 తులాల బంగారం, రూ.2 లక్షల 25 వేల నగదు తోపాటు దొంగతనానికి ఉపయోగించిన పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. సంపత్ గతంలో 35కు పైగా దొంగతనాలకు పాల్పడినట్లు పది పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు.