
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్‌ను గాయాలు వేధిస్తున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 19) పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు, ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఫిబ్రవరి 17న కరాచీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫెర్గూసన్ కాలికి గాయమవడంతో అసౌకర్యంగా కనిపించాడని బ్లాక్‌క్యాప్స్ తమ ప్రకటనలో తెలిపింది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత గాయంతో ఫెర్గుసన్ దూరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ఫెర్గూసన్ సేవలను కోల్పోవడం పట్ల న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ నిరాశ వ్యక్తం చేశాడు. ఫెర్గూసన్ స్థానంలో 30 ఏళ్ల కైల్ జామిసన్ ఎంపికయ్యాడు. 10 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైన జేమిసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పటికే న్యూజిలాండ్ యువ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ తొడ కండరాల గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. న్యూజిలాండ్ క్రికెట్ సియర్స్ స్థానంలో జాకబ్ డఫీని ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే ట్రై సిరీస్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర కోలుకున్నాడు. అతను తొలి మ్యాచ్ కు ఆడే అవకాశాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌తో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తలపడుతుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇదే గ్రూప్ లో భారత్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీకి ఈ మెగా టోర్నీకి న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ నే నమ్ముకుంది. ఆసియాలో జరగనున్న ఈ టోర్నీలో ఏకంగా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది. నాథన్ స్మిత్ , కైల్ జెమీసన్, హెన్రీ, విలియం ఓ రూర్కే,జాకబ్ డఫీ లాంటి పేస్ దళంతో బరిలోకి దిగుతుంది. వీరికి ఆల్ రౌండర్లు కెప్టెన్ సాంట్నర్ తో పాటు మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర బంతితో రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం న్యూజిలాండ్ జట్టు -
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్