భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడాదిన్నరకే మూలకు..

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు  : హంగూ, ఆర్భాటాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గవర్నమెంట్​ స్కూళ్ల​లో ఏర్పాటు చేసిన డిజిటల్​ క్లాసెస్​ మున్నాళ్ల ముచ్చటగా మారాయి. దాదాపు రూ. 1.85 కోట్లతో జిల్లాలోని వంద స్కూల్స్​లో ఏర్పాటు చేసిన డిజిటల్​క్లాసెస్​ పట్ల ఎంతో ఆసక్తి చూపిన స్టూడెంట్స్.. ప్రస్తుతం అవి పనిచేయకపోవడంతో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీతిఅయోగ్​లో భాగంగా పవర్ ప్రాజెక్ట్​ సంస్థ సీఎస్ఆర్​ ఫండ్స్​​తో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 100 గవర్నమెంట్​స్కూల్స్​లో డిజిటల్​ క్లాసెస్​ను ఏడాదిన్నర కిందట కలెక్టర్​ అనుదీప్​ ప్రారంభించారు. డిజిటల్​ క్లాసెస్​కు సంబంధించి ఎన్ఈఎక్స్ టీ ఎడ్యుకేషన్​అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. మూడేండ్లపాటు డిజిటల్​ క్లాసెస్​కు సంబంధించి మెటీరియల్​ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసి ఇచ్చేలా ప్లాన్​చేశారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్​వరకు డిజిటల్​బోధనకు టీచర్లు శ్రీకారం చుట్టారు. సబ్జెక్ట్​లలో ఉన్న చాప్టర్స్​ను వీడియో, యానిమేషన్​పద్ధతిలో చెబుతుండడంతో స్టూడెంట్స్​కూడా డిజిటల్​ క్లాసెస్​పై ఆసక్తి చూపించారు.

ప్రధానంగా కస్తూర్బా విద్యాలయ స్టూడెంట్స్​డిజిటల్​ క్లాసెస్​ను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని స్టూడెంట్స్​ను డిజిటల్​క్లాసెస్​ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే నెట్​సిగ్నల్స్​​ లేక పలుచోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఏడాదిన్నర పాటు సక్సెస్​ఫుల్​గా నడిచిన డిజిటల్​క్లాసెస్​ మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో స్టూడెంట్స్​తో పాటు టీచర్లలో నిరుత్సాహం నెలకొన్నది. ఏడాది పాటే టెండర్​ ఉందని, లైసెన్స్​ రెన్యువల్​చేయించుకోవాలని ఎన్​ఈఎక్స్​టీ సంస్థ చెబుతోంది. రెన్యువల్​ చేయించుకోవాలంటే దాదాపు రూ. 80 లక్షలు కట్టాలని విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. కాగా డిజిటల్​క్లాసెస్​కు సంబంధించి ఎన్ఈఎక్స్ టీ సంస్థతో తమకు మూడేండ్ల అగ్రిమెంట్​ ఉన్నప్పటికీ ఏవో సాంకేతిక కారణాలు చూపుతూ క్లాసెస్​ను ఆపేశారని విద్యాశాఖాధికారులు వాపోతున్నారు. విషయాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొంటున్నారు. డిజిటల్​ క్లాసెస్​ను పునరుద్ధరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్టూడెంట్స్​తో పాటు టీచర్లు కోరుతున్నారు. 

త్వరలో క్లాసెస్ ​స్టార్టవుతయ్

డిజిటల్​ క్లాసెస్ ను స్టూడెంట్స్ చాలా బాగా రిసీవ్​ చేసుకున్నారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ ఎన్ఈఎక్స్​టీ సంస్థ డిజిటల్​ క్లాసెస్​ను ఆపేసింది. మూడేండ్లపాటు ఒప్పందం అన్నారు. ఇప్పుడేమో ఏడాది అంటున్నారు. ఈ విషయం కలెక్టర్​దృష్టికి తీసుకెళ్లాం. డిజిటల్​ క్లాసెస్​ విషయంలో కలెక్టర్​ప్రత్యేక చొరవ చూపుతున్నారు. త్వరలోనే క్లాసెస్​స్టార్ట్​అయ్యే అవకాశం ఉంది.  

– సోమశేఖర శర్మ, డీఈఓ, భద్రాద్రికొత్తగూడెం

స్టూడెంట్స్​ ఆసక్తి చూపుతున్నారు

పినపాక జడ్పీహెచ్​ఎస్​ స్కూల్​లో డిజిటల్​ క్లాసెస్​ స్టూడెంట్స్​ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిగ్నల్స్​లేక స్టూడెంట్లు కొంత ఇబ్బందికి గురైనప్పటికీ క్లాసెస్​ చాలా ఆహ్లాదకరంగా సాగాయి. డిజిటల్​ క్లాసెస్​ ఆగిపోవడం పట్ల స్టూడెంట్స్​అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్లాసెస్​ తిరిగి ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. 

– రాంగోపాల్, టీచర్, పినపాక

డిజిటల్​ క్లాసెస్​ బాగున్నయ్

డిజిటల్​క్లాసెస్​ చాలా బాగున్నాయి. గతేడాది డిజిటల్​ పద్ధతిలో పాఠాలు చెప్పడంతో బాగా అర్థమయ్యాయి. వీడియో, యానిమేషన్​పద్ధతిలో మనసుకు హత్తుకునేలా పాఠాలున్నాయి. ఇప్పుడు డిజిటల్ ​క్లాసెస్​ ఆగిపోవడం బాధగా ఉంది. అధికారులు స్పందించి తిరిగి స్టార్ట్​అయ్యేలా చూడాలి. 

– నిధి, పదో తరగతి స్టూడెంట్, జడ్పీహెచ్ఎస్​ పినపాక