గురుకులాలకు తాళాలు.. గత పాలకుల పాపమే!

గురుకులాలకు తాళాలు.. గత పాలకుల పాపమే!

తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించడానికి శ్రీకారం చుట్టింది.  సమీకృత రెసిడెన్సీ పాఠశాలల్లో పాఠ్యాంశాలను ఏకీకృతం చేస్తున్నప్పుడు స్థానిక సంస్కృతిని దృష్టిలో ఉంచుకోవడం ఉత్తమం.  విద్యార్థులు ఒక ప్రాంతంలో సంపాదించిన జ్ఞానాన్ని ఇతర ప్రాంతాలకు అన్వయించవచ్చు.  ఇది అన్ని సబ్జెక్టులలో మెరుగైన విద్యా పనితీరుకు దారి తీస్తుంది. విద్య పట్ల కాంగ్రెస్  ప్రభుత్వం నిబద్ధత  విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకంగా మారింది. అందుకే విద్యా విధానం పటిష్టపరిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర పాఠ్యాంశాల రూపకల్పనతో పాటు,  సమీకృత  పాఠశాలలు పక్కా భవనాల నిర్మాణం కోసం ఇటీవల 28 నియోజకవర్గాలలో శంకుస్థాపన చేసింది.  

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్​కు ప్రాధాన్యం

'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్స్' విద్యార్థుల ఉజ్వల భవిష్యత్​కు  ప్రయోజనకరంగా ఉంటాయనేది యథార్థం.  వాస్తవానికి రాష్ట్రంలో 1,023 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ 662 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.  అందరికీ  ఉన్నత విద్య అందించాలని,  డ్రాప్​అవుట్ లేని,  వివక్ష లేని సామాజిక  తెలంగాణలో సమీకృత విద్యాలయాల ఏర్పాటుకు ఊపిరి పోస్తే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుట్ర పూరితంగా గురుకులాలకు అద్దె చెల్లించలేదని దుర్మార్గంగా తాళాలు వేసే పనికి ఒడిగట్టింది.  

కాగా, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 1986 లో స్థాపించిన నవోదయ విద్యాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల నుంచి  ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు 6వ తరగతి నుంచి 12 వరకు ఉచిత విద్యను అందిస్తాయి. అకడమిక్ ఎక్సలెన్స్, నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన పెంపొందించడంపై దృష్టి సారిస్తాయి.   నవోదయ విద్యాలయాలు సామాజిక పురోగతిలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  ఈ క్రమంలో దశాబ్ద కాలంగా దగా పడ్డ విద్యారంగాన్ని తెలంగాణ పునర్నిర్మాణంలో  భాగంగా సీఎం రేవంత్  ‘యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్’ ప్రారంభించడం  మంచి పరిణామం.

విపక్షాల ఆరోపణలు నమ్మదగ్గవేనా?

 ఒక్కో  నియోజకవర్గంలో మొదటిసారిగా ప్రారంభించిన సమీకృత పాఠశాలల్లో 2,500 మంది విద్యార్థులకు  ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని అధికారులకు ఆదేశిస్తే నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున కుదించే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.  నాడు కేసీఆర్ సదుద్దేశంతో ప్రారంభించిన గురుకులాలకు 80శాతం పింక్ పార్టీ నాయకులు అద్దెకు  ఇచ్చిన భవనాలే నిలయాలుగా ఉన్నాయి.  ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం గురుకులాలు తగ్గిస్తున్నదని బీఆర్​ఎస్​ నాయకులు చెపుతున్నారు.  

అద్దె భవనాల ఓనర్లను  ఉసికొల్పి కిరాయి ఇవ్వడం లేదని బదనాం చేసే పనికి ఒడిగట్టడం దురదృష్టకరం. ఇప్పుడు  ప్రజాప్రభుత్వం యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట పక్కా భవనాల నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టారు.  నాడు గురుకులాలు ఏర్పాటు చేసిన అద్దె భవనాలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో ఉన్నవే గనుక, వ్యూహంలో భాగంగానే అద్దె భవనాలకు తాళాల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శ జోరందుకుంది.  చెరువులో కట్టిన కాలేజీలను సైతం విద్యా సంవత్సరం మధ్యలో పిల్లలకు ఆటంకం కలిగించొద్దని 'హైడ్రా' కూల్చడం ఆపేసింది.  అటువంటిది మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో తాళాలు వేసి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసిన భవనాల  యాజమాన్యాల వెనక ఎవరున్నారో తెలియదు. ఇది మంచి పరిణామం కాదని విద్యావేత్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

- డాక్టర్  సంగని మల్లేశ్వర్,
జర్నలిజం డిపార్ట్​మెంట్​ హెడ్,
కాకతీయ వర్సిటీ