బ్యాంకు సిబ్బందితో కలిసి రూ.40 కోట్లకు టోకరా

బ్యాంకు సిబ్బందితో కలిసి రూ.40 కోట్లకు టోకరా
  • బ్యాంకు సిబ్బందితో కలిసి రూ.40 కోట్లకు టోకరా
  • ముగ్గురి అరెస్టు, నిందితుల్లో బ్యాంకు మేనేజర్, సర్వీస్​ డెలివరీ మేనేజర్​
  • కీలక నిందితుడిగా ఉన్న ఏపీ కాంగ్రెస్​ నేత కూడా అదుపులోకి
  • ఆదిత్య బిర్లా హౌసింగ్​ ఫైనాన్స్​ అకౌంట్ నుంచి నిధులు బదిలీ

గచ్చిబౌలి, వెలుగు: ఆదిత్య బిర్లా హౌసింగ్​ ఫైనాన్స్​ అకౌంట్లోకి లాగిన్​ అయ్యి రూ. 40 కోట్లు కొట్టేశారు.  శంషాబాద్​ ఇండస్ ​ఇండ్​ బ్యాంకు​ మేనేజర్, సర్వీస్​ డెలివరీ మేనేజర్, ఏపీ కాంగ్రెస్  నేత షేక్  బషీద్​ ఈ మోసానికి పాల్పడ్డారు. సైబరాబాద్​ ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​ (ఈఓడబ్ల్యూ) అధికారులు వీరిని అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్​ తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్​లో నివాసం ఉంటున్న కాంగ్రెస్  నేత షేక్​ బషీద్​ వ్యాపారి. ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఏపీలోని రాజంపేట​ లోక్​సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ తరపున పోటీచేశాడు.  జూబీహిల్స్​కు చెందిన వ్యాపారి ​ ఉదయ్​కుమార్​రెడ్డికి చెందిన ఇంటిని కొనుగోలు చేసేందుకు బషీద్​ అతనితో ఒప్పందం చేసుకున్నాడు.

డబ్బుల కోసం శంషాబాద్​లోని ఇండస్ ఇండ్​ బ్యాంకును సంప్రదించాడు.​ ఈ బ్యాంకులో బండ్లగూడ జాగీర్​ అభ్యుదయ నగర్  కాలనీకి చెందిన కనుగుల రామస్వామి మేనేజర్​గా,  శంషాబాద్​కు చెందిన రాజేష్​ సర్వీస్​ డెలివరీ మేనేజర్​గా పనిచేస్తున్నారు. తన ప్లాన్ లో భాగంగా రామస్వామితో బషీద్​ డీల్​ కుదుర్చుకుని రూ.కోటి ఇచ్చాడు. ఆ తర్వాత ఉదయ్​కుమార్​రెడ్డితో బ్యాంకులో అకౌంట్​ ఓపెన్​ చేయించాడు. ఆదిత్య బిర్లా హౌసింగ్​ ఫైనాన్స్​ లిమిటెడ్​ కంపెనీ అకౌంట్లోకి ఎంటర్​ అయ్యేందుకు రామస్వామి..  రాజేష్​ వద్ద లాగిన్​ ఐడీ తీసుకున్నాడు. ఈనెల 12న బషీద్..​  ఆదిత్య బిర్లా ఫైనాన్స్​ లిమిటెడ్​ కంపెనీ అకౌంట్​ నుంచి రూ.40 కోట్లను  ఉదయ్​కుమార్​రెడ్డి అకౌంట్​కు బదిలీ చేయించాడు.

ఆ తర్వాత ఉదయ్​కుమార్​రెడ్డి అకౌంట్లో రూ.10 కోట్లు ఉంచి, మిగిలిన డబ్బులను బషీద్​ తనకు తెలిసిన మరో 7 అకౌంట్లకు రామస్వామితో బదిలీ చేయించాడు. ఈ డబ్బుతో రెండు టయోటా ఫార్చ్యునర్​ కార్లు కొన్న బషీద్..​ ఒక కారును రామస్వామి వద్ద, మరో కారును ఉదయ్​కుమార్​రెడ్డి వద్ద పెట్టాడు. అయితే.. చెక్కులు, ఆర్టీజీఎస్​ ఫాం​లేకుండానే ఆదిత్య బిర్లా హౌసింగ్  ఫైనాన్స్​ లిమిటెడ్​ నుంచి రూ.40 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించిన ఇండస్​ఇండ్​ బ్యాంకు జోనల్​ హెడ్​ ఆపరేషన్స్​ అధికారి మణికందన్​ రామనాథన్..​ ఈనెల 19న శంషాబాద్​ బ్యాంకు​మేనేజర్, సర్వీస్​ డెలివరీ మేనేజర్, కస్టమర్​ ఉదయ్​కుమార్​రెడ్డిపై సైబరాబాద్​ ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​కు ఫిర్యాదు​చేశాడు.

అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బ్యాంకు​ మేనేజర్​ రామస్వామి, సర్వీస్​ డెలివరీ మేనేజర్​ రాజేష్​ను అరెస్టు చేశారు. షేక్​ బషీద్ ను ఢిల్లీలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్​కు తరలించారు. అలాగే వివిధ బ్యాంకులో ఉన్న రూ. 23 కోట్లను బ్లాక్​ చేసి, బషీద్  కొన్న కార్లను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్​ నేత షేక్​ బషీద్​పై హైదరాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బంజారా హిల్స్, బోయిన్​పల్లి, నార్సింగి, వికారాబాద్  జిల్లాలోని మోమిన్​పేట​ పోలీస్​ స్టేషన్​లో 10 చీటింగ్​ కేసులు ఉన్నాయి.