ఖైరతాబాద్, వెలుగు : జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్లు పోరాటం చేయాలని ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ అన్నారు. ఈ నెల 27న జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర రెండో మహాసభల లోగోను సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ తో పాటు ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వినయకుమార్, ఇండియా టీవీ తెలంగాణ బ్యూరో ఇన్చార్జ్ సురేఖ, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి. బసవ పున్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం సర్కారు మద్దతు కూడా కూడగట్టాలని సూచించారు.
ఆధునిక యుగంలో పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు, అన్యాయాలు, పేద వర్గాలపై జరిగే వివక్షలపై వార్తలు రాసేందుకు విలేకర్లు వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు తలెత్తడం బాధకరమన్నారు. పెరిగిన డిజిటల్ జర్నలిజంలో మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో జరగనున్న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో అర్బన్, రూరల్ జర్నలిస్టుల సమస్యలపై చర్చించి, పలు తీర్మానాలు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, ఎల్గొయి ప్రభాకర్, కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు, హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్, నాయకులు రాజశేఖర్, నవీన్, కాలేబ్, మధుకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.