- న్యాయమూర్తి భవానీ చంద్ర
కరీంనగర్ లీగల్, వెలుగు: లోక్ అదాలత్ తో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని మొదటి అదనపు జిల్లా జడ్జి భవానీ చంద్ర తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఆమె మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసులతో పాటు కోర్టులకు రాని కేసులను కూడా పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, అదనపు జిల్లా జడ్జి కుమార్ వివేక్, సబ్ జడ్జి యువరాజా, మెజిస్ట్రేట్లు శ్రీనిజ, సరళా రేఖ, హేమలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సుజయ్, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లి: లోక్ అదాలత్ తో కక్షిదారులకు సమ న్యాయం జరుగుతుందని మెట్ పల్లి కోర్టు మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ అన్నారు. శనివారం కోర్టు హాలులో నిర్వహించిన లోక్ అదాలత్ లో 139 కేసులు పరిష్కరించారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి ఆనంద్, పీపీ మాధవి తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ: లోక్‌అదాలత్‌తో చాలా కేసులకు పరిష్కారం దొరుకుతుందని వేములవాడ సబ్ కోర్టు జడ్జి రవీందర్ అన్నారు. శనివారం వేములవాడ కోర్టులో పలు కేసులను జడ్జి పరిష్కరించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ప్రతీక్ సిహగ్, లోక్ అదాలత్ సభ్యులు సత్యనారాయణ, నక్క దివాకర్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రసమయిపై చర్యలు తీసుకోండి
పోలీసులకు జర్నలిస్టుల ఫిర్యాదు
గన్నేరువరం, వెలుగు: మండలానికి చెందిన పత్రికా విలేకరులపై అనుచిత వాఖ్యలు చేసిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ప్రెస్మీట్అని పిలిచారని, అక్కడికి వచ్చిన జర్నలిస్టులపై తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. తనపై ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ‘మీరు గుప్పెడు.. మేము పుట్టెడు మంది..’ అని టీఆర్ఎస్ శ్రేణులను జర్నలిస్టులపై ఉసిగొలిపే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కరుణాకర్ రావు, దాడుల నివారణ కన్వీనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
మండల ప్రెస్ క్లబ్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ మండల బీజేపీ లీడర్లు బాలకిషన్ దిష్టిబొమ్మను రాష్ట్ర రహదారిపై గుండ్లపల్లి స్టేజీ వద్ద శనివారం దహనం చేశారు. జర్నలిస్టులకు ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ మండలాధ్యక్షుడు నగునూరి శంకర్ డిమాండ్ చేశారు.
రసమయీ.. నోరు అదుపులో పెట్టుకో
కరీంనగర్ టౌన్: మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్న ప్రజలు, కాంగ్రెస్ లీడర్లను పోలీసులు చేత బెదిరింపులకు గురి చేస్తున్నారని మండి పడ్డారు. అసమర్థ పాలనను నిలదీస్తే తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. ఎమ్మెల్యేగా ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇప్పించారని ప్రశ్నించారు.
సర్పంచులను అప్పులపాలు చేస్తున్నరు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, వెలుగు: పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం సర్పంచులను అప్పుల ఊబిలోకి నెడుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులు రాక సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు సక్రమంగా బాధ్యతలు నిర్వహించడంలేదన్నారు. గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠ ధామాలు నిర్మించిన సర్పంచులకు ఏళ్ల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీసీ జిల్లా ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ప్లోర్ లీడర్ దుర్గయ్య, కాంగ్రెస్ లీడర్లు రాజేందర్, పోలస నందయ్య పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం:ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి
ఇల్లందకుంట,వెలుగు: రైతు సంక్షేమానికే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బూజునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని అన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ వైస్ చైర్మన్రమేశ్, ఇల్లందకుంట ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కొమురెల్లి, ఎంపీపీ పావని, సర్పంచ్అరుణ, తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లి: తెలంగాణ రైతులను రాజులు చేయడమే టీఆర్ఎస్ సర్కారు లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల: స్థానిక వ్యవసాయ మార్కెట్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శనివారం ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ రకం వరికి రూ.2060 , సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.
మల్లాపూర్: మండలంలోని సిరిపూర్, ముత్యంపేట, చిట్టాపూర్ లో ఫ్యాక్స్ చైర్మన్లు అంజిరెడ్డి, తక్కళ్ల నరేశ్‌రెడ్డి, మోహన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సరోజన, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు కృష్ణవేణి , మమత, సరోజన, సాయిలు, గోవింద్ నాయక్ , ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం: మండలంలోని ఓడేడు,అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముత్తారం సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ జిల్లా డైరెక్టర్ రాజిరెడ్డి ప్రారంభించారు. రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు చంద్రమౌళి, వైస్ ఎంపీపీ రవీందర్ రావు, సర్పంచ్ బక్కారావు, రైతులు పాల్గొన్నారు.
టీబీ పేషెంట్లకు సరుకుల పంపిణీ
రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలోని టీబీ పేషెంట్లకు పెడియాట్రిషన్ డాక్టర్సురేంద్రబాబు గ్రాసరీ పంపిణీ చేశారు. శనివారం సిరిసిల్లలో ప్రధాన మంత్రి టీబీ ముక్త భారత్ ఆభియాన్ లో భాగంగా టీబీ రోగులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేషెంట్లు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో సరైన ట్రీట్ మెంట్ తీసుకుంటే టీబీని జయించవచ్చన్నారు. జిల్లాలో 800 మంది పేషెంట్లు ఉంటే అందులో 400 మంది టీబీని జయించారన్నారు. మిగతా సగం మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చిన్న, రఘు, కృష్ణ, కరుణాకర్, శ్రీధర్ పాల్గొన్నారు.
రాజకీయంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సత్యప్రసన్నరెడ్డి
చొప్పదండి, వెలుగు: మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడే సాధికారత ఏర్పడుతుందని మహిళా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి అన్నారు. శనివారం చొప్పదండిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్ట సభలలో మహిళలు 50 శాతం ఉన్నప్పుడే మహిళలకు గౌరవం దక్కుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను చిన్న చూపు చూస్తున్నాయని, శాసనసభలో 5 శాతం, పార్లమెంటులో 10 శాతం మాత్రమే చట్ట సభలలో వున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాగానే మహిళా బిల్లును తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలి’
కోరుట్ల,వెలుగు: రాష్ట్రంలో భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కోరుట్లలో ఆయన ఆయన మాట్లాడారు. భాషా పండితులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా పదోన్నతు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా పండితులను నియామకపు తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తించాలని, పదోన్నతులు కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షుడు నాగుల భిక్షపతి, జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేందర్, స్వామి యాదవ్, హనుమకొండ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.