లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆశించింది దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాన్ని. దురదృష్టవశాత్తు ఆయన నాటిన జనతాపార్టీ అనే మొక్క, మూడు దశాబ్దాల తర్వాత ఇలా రాష్ట్రానికో ముక్కగా మారిపోయి, కుటుంబ పార్టీలుగా అవతారమెత్తి, అవినీతిలో మునిగి తేలుతాయని లోక్‌నాయక్ జేపీ కలలో కూడా ఊహించి ఉండరు!
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్.. పేరు వినని ప్రజాస్వామ్య ప్రియుడు ఉండకపోవచ్చు. భారత ప్రజాస్వామ్యానికి నడక నేర్పిన నాయకుడాయన. ప్రతిపక్షమూ గెలిచి అధికారం చూపెట్టగలుగలదని నిరూపించిన లోక నాయకుడు. లోక్ నాయక్ జేపీ దేశానికి రెండో మహాత్ముడని చెప్పొచ్చు. దేశ స్వాతంత్ర్య ఉద్యమకారుడుగానే కాదు, స్వాతంత్ర్యనంతరం క్రాంతికారి రాజకీయ నాయకుడుగా ఈ దేశానికి అమూల్యమైన సేవలందించారు. ఆయనకు మరణానంతరం 1999లో ‘భారత రత్న’ దేశ అతి పెద్ద పురస్కారం లభించింది. యూపీలోని బలియా జిల్లాలో కాయస్త కుటుంబంలో ఆయన జన్మించారు.
స్వాతంత్ర్య పోరాటంలో..
1929లో నెహ్రూ ఆహ్వానం మేరకు జేపీ 1929లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జేపీకి గాంధీ మార్గదర్శకుడయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకిగా1930లో జేపీకి జైలు శిక్షవిధించారు. నాసిక్ జైలులో రామ్ మనోహర్ లోహియా, మినూ మసాని, అచ్యుత్ పట్వర్ధన్, అశోక్ మెహతా, బసవన్ సింగ్, సీకే నారాయణస్వామి వంటి జాతీయ నేతలతో కలిశారు.ఆయన విడుదలైన తర్వాత, కాంగ్రెస్‌లోనే ఒక గ్రూప్‌గా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పేర ఆచార్య నరేంద్ర దేవ అధ్యక్షుడిగా ఏర్పడ్డారు.1942 క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపు ఇచ్చినపుడు జయప్రకాశ్ నారాయణ్ యోగేంద్ర శుక్లా, రామ్మనోహర్ లోహియా లాంటివారంతా అజ్ఞాత ఉద్యమాన్ని నడిపారు. స్వాతంత్ర్యం వచ్చిన1947 నుంచి 1953 వరకు జేపీ భారీగా కార్మికులు ఉన్న రైల్వే మెన్స్ ఫెడరేషన్‌ను నడిపారు. మన దేశానికి మార్క్సిజం కన్నా, సోషలిజమే సరైందని ఆయన నమ్మారు.
‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమం
ఇందిరాగాంధీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిందని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రధాని, అవినీతి ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని జేపీ ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశంలో అవినీతిని ప్రశ్నించి మొదటి ఉద్యమం అదే. జేపీ సంపూర్ణ క్రాంతి ఉద్యమం రాజకీయ అవినీతిని ప్రశ్నించడం నేర్పింది. 25 జూన్ 1975న ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడం, ప్రతిపక్షనేతలందరినీ అదే రోజు అరెస్టు చేయడం జరిగింది.
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జేపీ లక్ష మందితో భారీ బహిరంగ సభ జరిపారు. జేపీని జైలులో నిర్బంధించారు. ప్రభుత్వ నిర్బంధలోనే జేపీ ఆరోగ్యం దెబ్బతిన్నది. కిడ్నీలు ఫెయిల్ కావడంతో జస్ లోక్ ఆసుపత్రిలోనే జీవిత కాలం డయగ్నస్టిక్ చికిత్స తీసుకున్నారు. యూకేలో నోబెల్శాంతి బహుమతి గ్రహీత నియోల్ బేకర్ జేపీని విడుదల చేయాలని ప్రపంచవ్యాప్తంగా గళమెత్తారు.
ప్రత్యామ్నాయ ప్రయోగం
ఇందిరాగాంధీ 18 జనవరి 1977న ఎమర్జెన్సీని తొలగించింది. ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జేపీ సలహా మేరకు అనేక ప్రతిపక్షాలు (జనసంఘ్, సోషలిస్ట్, లోక్‌దళ్, ఓల్డ్ కాంగ్రెస్) కలిసి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. రైటిస్టు, సెంట్రిస్టు, లెఫ్టిస్టు, సోషలిస్టు అనే తేడా లేకుండా దేశంలో అన్ని ప్రతిపక్షాలను కలిపి ఒక జాతీయపార్టీగా నిర్మాణం చేయడంలో జయప్రకాశ్ నారాయణ్ సఫలీకృతులయ్యారు. నిజానికి అదేమీ మామూలు విషయం కాదు.
కత్తిమీద సాములాంటిది. జేపీ సాహసం చేసి దేశానికి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపగలిగారు. దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే, ప్రత్యామ్నాయ రాజకీయం అనివార్యం అని ఆయన గట్టిగా నమ్మారు. ఒక ప్రయోగం చేశారు. విజయం సాధించారు.
మురార్జీ దేశాయి ప్రధానిగా..
ఎమర్జెన్సీలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలే జనతాపార్టీ గెలుపునకు సాధనాలుగా మార్చగలిగారు. అఖండ మెజారీటీతో (300 స్థానాలు) జనతాపార్టీ అధికారం చేపట్టింది. తనను జైలు పాలుచేసిన ఇందిరాగాంధీని, జనతాపార్టీ గెలిచాక జేపీ సాదరంగా వెళ్లి కలిశారు తప్ప కక్షసాధింపు ధోరణి ఆయనలో ఏనాడూ కనిపించలేదు. మొరార్జీదేశాయిని ప్రధాని పదవికి జేపీ సూచించారు. 1977లో రాష్ట్రపతి పదవికి జేపీని ఎన్నుకోవాలని అప్పటి జనతాపార్టీ యువ నేతలంతా పట్టుపట్టారు. కానీ జేపీ తిరస్కరించారు. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. జనతాపార్టీ పాలన రెండున్నరేళ్లు బాగానే సాగింది.
కుటుంబ పార్టీలుగా మారిన జనతాదళ్
1987లో బోఫోర్స్ అవినీతి విషయంలో రాజీవ్‌ను నిందిస్తూ రక్షణమంత్రిగా రాజీనామా చేసి వీపీ సింగ్ బయటికి వచ్చారు. జనతా పరివార్ పార్టీలన్నిటీనీ తిరిగి జనతాదళ్గామార్చి, బీజేపీతో పొత్తు కుదుర్చుకొని 1989 ఎన్నికల్లో కేంద్రంలో మరొకసారి కాంగ్రెసేతర( వీపీ సింగ్) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అదీ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కాంగ్రెస్ బయటి మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా తన జీవిత కలను నెరవేర్చుకున్నారు. 6 నెలలు దాటకుండానే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించింది. జనతా పరివార్ పార్టీలన్నీ మరొకసారి ఎవరికి వారు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు.
అప్పటికే యూపీలో, బిహార్‌లో, ఒరిస్సాలో, కర్నాటకలో, హర్యానాలో గెలిచి అధికారం చేపట్టిన జనతాదళ్ ముఖ్యమంత్రులంతా స్వతంత్రులుగా ప్రకటించుకొని సొంత ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నారు. యూపీలో ములాయం సింగ్ సమాజ్‌వాదీ పార్టీ, అజిత్ సింగ్ ఆర్ఎల్డీ, బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, ఒరిస్సాలో బిజూపట్నాయక్, కర్నాటకలో దేవెగౌడ జేడీఎస్, హర్యానాలో దేవీలాల్ .. జనతాదళ్ అస్తిత్వాన్ని అడ్రసు లేకుండా చేశారు. వాళ్లు ప్రకటించుకున్న ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలుగా మార్చేసుకున్నారు.
అవి దేశ రాజకీయాలనే అపహాస్యంగా మార్చేశాయి. కుటుంబ పాలనలకు జీవం పోశాయి. ఆయా రాష్ట్రాల్లో కుటుంబ పాలనలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. 1996 నుంచి 98 వరకు దేవెగౌడ, గుజ్రాల్ ల సంకీర్ణ ప్రభుత్వాలు కూడా అభాసుపాలయ్యాయి.
అవినీతి పాలనలు
లాలూ గడ్డి కుంభకోణం నుంచి మొదలుకుంటే హర్యానాలో చౌతాలా టీచర్ల నియామక కుంభకోణం దాకా ఎన్నైనా చెప్పొచ్చు. దేశంలో మరిన్ని ప్రాంతీయ పార్టీలు పెరిగిపోయాయి. అవి కూడా కుటుంబ పార్టీలుగా రాష్ట్రాలను ఏలుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అవినీతి అధికమయిందని గడిచిన మూడు దశాబ్దాల కాలమే ఈ దేశానికి పెద్ద అనుభవాన్ని ఇచ్చింది.
రెండు ప్రత్యామ్నాయాలను కోరుకున్నారు
ఆనాడు జనతా పార్టీలో విలీనమైన జనసంఘ్ మాత్రం తిరిగి బీజేపీ పేరుతో దేశంలో బలమైన జాతీయ పార్టీగా, మాత్రం ఎదిగింది. లోక్ నాయక్ జేపీ దేశంలో ఆరోగ్యకరమైన రెండు జాతీయ ప్రత్యామ్నాయాలు ఉండాలని బలంగా కోరుకున్నారు. ఆ విషయంలో మిగతా జనతా పరివార్ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలకు అలవాటు పడిపోయాయి. కాంగ్రెస్ పార్టీని జేపీ ఏనాడూ తూలనాడలేదు. దేశంలో కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యామ్నాయం మాత్రమే ఉండాలని ఆయన కోరుకున్నారు.
జాతీయ నేతలను ఇచ్చారు
జనతా ప్రయోగం విఫలం కావచ్చు. కానీ జయప్రకాశ్ నారాయణ్ ఈ దేశానికి అనేకమంది జాతీయ నాయకులను అందించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, మధులిమాయె, మధు దండవతె, జార్జి ఫెర్నాండెజ్, అద్వానీ, కర్పూరీ ఠాకూర్, రామకృష్ణహెగ్డే, బిజూ పట్నాయక్ వంటి అనేక మందిని దేశానికి జాతీయ నేతలుగా అందించారు. సోషలిస్టులు, జనసంఘీయులు ఈ దేశానికి జాతీయ నాయకులుగా పరిచయమయ్యారంటే..ఆనాడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జనతాపార్టీని ఏర్పాటు చేయడమే అనడంలో సందేహం లేదు. కానీ , దేశంలో ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారడం, వాటి పాలనల్లో అవినీతి పెరిగిపోవడం లోక్‌నాయక్ కలలను వమ్ముచేస్తున్నాయని చెప్పాలి.
ప్రయోగ విఫలం జేపీని బాధించింది
చౌదరీ చరణ్ సింగ్‌కు ప్రధాని కావాలనే ఆకాంక్ష జనతాపార్టీ ప్రభుత్వాన్ని కూలదోసింది. మరోవైపు మాజీ జనసంఘ్ నేతల ద్వంద్వ సభ్యత్వ (ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఉన్నాయనే) అభ్యంతరం లేవనెత్తి కొందరు జనతాపార్టీ విచ్చిన్నానికి బాటలు వేశారు. జేపీ కలలుగన్న జనతా ప్రయోగం ఆయన బతికుండగానే, ఆయన కళ్ల ముందే విఫలం కావడం ఆయనను బాగా బాధించింది. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల ఎదుగుదలకు అది గొడ్డలిపెట్టుగా మారింది. జేపీ 8, అక్టోబర్, 1979న మరణించారు.
ప్రత్యామ్నాయ నిర్మాణం కుప్పకూలడం అనేది ఒక జేపీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఈ దేశ రాజకీయవ్యవస్థ అనారోగ్యానికి అదొక మచ్చగా మారిపోయింది. భవిష్యత్ ప్రత్యామ్నాయాల పట్ల ప్రజల్లో అనుమానాలను పెంచింది. నవ్వే వాడికి నవ్వుకునేంతగా మారింది. జనతాపార్టీని అతుకుల బొంత అని అవహేళన చేసేవారికి అదొక ఆట విడుపుగా మారింది. కానీ ఈ దేశం ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల విశ్వాసం కోల్పోవడానికి అవకాశం ఇచ్చిందనే బాధ పడ్డవాళ్లూ ఉన్నారు.
జనతా పరివార్‌లోని పార్టీలు ఎవరిదారి వారు చూసుకోవడం మొదలు పెట్టారు. మాజీ జనసంఘ్ నేతలంతా 1980లో ముంబయిలో సమావేశమై వాజ్‌పేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడ్డారు. చౌదరీ చరణ్‌సింగ్ నేతృత్వంలో లోక్‌దళ్ మళ్లీ ఏర్పడింది. కొద్ది మంది సోషలిస్టులు, ఓల్డ్ కాంగ్రెస్ నేతలు మాత్రమే జనతా పార్టీ పేరిట కొనసాగారు.
- కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్