
- దురుద్దేశంతో భారత్‌కు వచ్చేటోళ్లను అడ్డుకుంటం: అమిత్ షా
- దేశ భద్రతకు ముప్పు కలిగించేటోళ్లను వదిలిపెట్టం
- రోహింగ్యాల అక్రమ చొరబాట్లను బెంగాల్ సర్కార్ ప్రోత్సహిస్తున్నది
- బార్డర్‌లో ఫెన్సింగ్ వేయకుండా అడ్డుకుంటున్నదని ఫైర్
- ఇమిగ్రేషన్ బిల్లు–2025కి లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: దురుద్దేశంతో ఇండియాకు వచ్చే వారిని అడ్డుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘‘దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిని భారత్‌లోకి అనుమతించం. దురుద్దేశంతో ఇండియాకు రావాలనుకునే వారిని అడ్డుకుంటం. భారతదేశమేమీ ధర్మసత్రం కాదు. ఎవరైనా దేశాభివృద్ధికి పాటుపడేందుకు వస్తామంటే, వారిని తప్పకుండా ఆహ్వానిస్తాం. భారత్‌లో పర్యటించేందుకు, చదువుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి, వ్యాపారం చేయడానికి వచ్చే వాళ్లను ఎల్లవేళలా స్వాగతిస్తాం. కానీ భారత్‌కు ముప్పు కలిగించే వారిని మాత్రం వదిలిపెట్టం.. కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025కి లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ఈ బిల్లు దేశ భద్రతను బలోపేతం చేస్తుందని, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, హెల్త్, ఎడ్యుకేషన్, వ్యాపార రంగాలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు దోహదం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా దీని ద్వారా మన దేశానికి వచ్చే ప్రతి విదేశీయుడి సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇకపై భారత్‌కు వచ్చే ప్రతి విదేశీయుడి సమాచారం అప్ టు డేట్ కేంద్రం వద్ద ఉంటుందని వెల్లడించారు.
చొరబాట్లకు బెంగాల్ సర్కారే కారణం..
మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్నారని అమిత్ షా తెలిపారు. ఈ సమస్య తీవ్రమవుతున్నదని, వాళ్లంతా దురుద్దేశంతోనే ఇండియాకు వస్తున్నారని చెప్పారు. భారత్‌లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తే చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ చొరబాట్లను పశ్చిమ బెంగాల్ సర్కార్ అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘ఇండియా, బంగ్లాదేశ్ బార్డర్‌లో 450 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వర్క్ పెండింగ్‌లో ఉంది. ఎందుకంటే దానికి పశ్చిమ బెంగాల్ సర్కార్ భూమి ఇవ్వడం లేదు. ఫెన్సింగ్ వేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టినప్పుడల్లా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాయిజంతో పాటు మతపరమైన నినాదాలు చేస్తున్నారు.
చొరబాటుదారుల పట్ల పశ్చిమ బెంగాల్ సర్కార్ దయ చూపుతున్నది. అందుకే బార్డర్‌లో ఫెన్సింగ్ పూర్తి కావడం లేదు. మొత్తం 2,200 కిలోమీటర్ల బార్డర్‌లో కేవలం 450 కిలోమీటర్ల మేర మాత్రమే ఫెన్సింగ్ వర్క్ పెండింగ్‌లో ఉంది. భూమి ఇవ్వాలని బెంగాల్ సర్కార్‌కు 11 సార్లు లేఖలు రాసినా, ఏడు రౌండ్ల చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. బెంగాల్ నుంచే దేశంలోకి అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి. అక్కడి సర్కార్ వాళ్లకు ఆధార్ కార్డులు కూడా ఇస్తున్నది. దీంతో చొరబాటుదారులంతా దేశమంతటా విస్తరిస్తున్నారు” అని తెలిపారు. వచ్చే ఏడాది బెంగాల్‌లో తమ ప్రభుత్వమే వస్తదని, అప్పుడు ఫెన్సింగ్ వర్క్ పూర్తి చేస్తామని చెప్పారు.
బిల్లులో ఏముందంటే..?
నకిలీ పాస్‌పోర్టు, వీసాతో భారత్‌లోకి ప్రవేశించేవారికి ఏడేండ్ల వరకు జైలు శిక్ష , రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. గడువు ముగిసినప్పటికీ ఇండియాలో ఉంటున్న విదేశీయులను ట్రాక్ చేయడానికి వీలుగా వారి వివరాలను హోటళ్లు, యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు, ఆస్పత్రులు తప్పనిసరిగా ప్రభుత్వంతో పంచుకోవాలని ప్రతిపాదిత చట్టం చెప్తోంది. చెల్లుబాటు అయ్యే పాస్ పోర్టు, వీసాతో భారత్ లోకి ప్రవేశించినా, చట్ట నిబంధనలను అతిక్రమించే విదేశీయులకు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు.