ఏపీలో 30వేల మంది మహిళల అదృశ్యంపై లోక్ సభలో క్లారిటీ...

ఏపీలో 30వేల మంది మహిళల అదృశ్యంపై లోక్ సభలో క్లారిటీ...

ఏపీలో సంచలనం రేపిన మహిళల అదృశ్యంపై లోక్ సభ క్లారిటీ ఇచ్చింది.వైసీపీ హయాంలో రాష్ట్రంలో 30వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని జనసేన, టీడీపీలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ గతంలో జనసేన, టీడీపీలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని లోక్ సభ సాక్షిగా తేలింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో 2019 నుంచి ఏపీలో అమ్మాయిల మహిళల అదృశ్యంపై టీడీపీ పలు బీకే పార్థసారథి, లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూరకంగా వివరణ ఇచ్చారు.

ఏపీలో 2019 నుండి 2023వరకు 44వేల 685మంది బాలికలు, మహిళలు అదృశ్యం అయినట్లు కేసులు నమోదయ్యాయని, వారిలో 44వేల 22మందిని ట్రేస్ చేసినట్లు, కేవలం 663మందిని మాత్రమే ట్రేస్ చేయాల్సి ఉన్నట్లు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వైఎస్ జగన్ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ అందుబాటులో ఉండటం, ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవల వల్ల బాధితులు పోలీసులకు స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని అన్నారు బండి సంజయ్.

లోక్ సభ ఇచ్చిన వివరణతో ప్రతిపక్ష వైసీపీ అధికార కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధిస్తోంది. మహిళల అదృశ్యం కేసులను రాజకీయంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేశారని పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో  ఇప్పటికీ 1,542 మంది అదృశ్యమైన అమ్మాయిల ఆచూకీ తేలలేదని, వారంతా అక్రమ రవాణాకు గురైనట్టేనా? అంటూ ప్రశ్నించింది వైసీపీ. గతంలో వైసీపీపై దుష్ప్రచారాలు చేసి రాష్ట్ర ప్రతిష్టకు భంగం కల్పించిన టీడీపీ, జనసేనలు ఇప్పుడు ఏం సమాధనం చెప్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది.