- తెలంగాణలో 10 స్థానాలు గెలుస్తాం
- జాతీయ కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్న రేవంత్ సర్కారు
- రాహుల్ యాత్ర కోసం బస్సు ఏర్పాటు చేసిన్రు
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్
కరీంనగర్, వెలుగు: తెలంగాణలో పదికి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలను గెలుస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఆదివారం నిర్వహించిన పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అవినీతి ప్రభుత్వం పోయినా కాంగ్రెస్ రూపంలో మరో అవినీతి ప్రభుత్వం వచ్చిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి సర్కార్ జాతీయ కాంగ్రెస్కు ఫండింగ్ చేస్తోందని, రాహుల్ యాత్ర కోసం రేవంత్ రెడ్డి బస్సును ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదని, కాంగ్రెస్ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. ఓఆర్ఆర్, కాళేశ్వరం, ధరణి అవినీతి అని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బోయిన్ పల్లి ప్రవీణ్ రావు పాల్గొన్నారు.