- ఆగిన డీజే చప్పుళ్లు..కార్యకర్తల ర్యాలీలు
- చివరి రోజు జోరుగా కార్యక్రమాలు
కరీంనగర్, వెలుగు : లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం ముగిసింది. గత నెల రోజులుగా డీజే సౌండ్స్, కార్యకర్తల ర్యాలీలతో హోరెత్తిన పల్లెలు, పట్టణాలు ప్రచార వాహనాలు లేకపోవడంతో నిశ్శబ్దంగా మారాయి. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చివరి నిమిషం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రచారం చివరి రోజైన శనివారం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ సిటీలో భారీ ర్యాలీ, కార్నర్ మీటింగ్ నిర్వహించగా, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్, సిరిసిల్లలో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ హుజురాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి రోడ్ షో లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును ఆలస్యంగా ప్రకటించినప్పటికీ ఉన్న తక్కువ టైమ్ లోనే ప్రచారంలో దూసుకెళ్లారు.
ఎన్నికల ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలను, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీలను సమన్వయం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంట, సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరై కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల షెడ్యూల్ కు ముందే ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా కరీంనగర్ సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ శ్రేణులతో ఇందిరా చౌక్ జనసంద్రం
చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరాచౌక్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, వెలిచాల రాజేందర్ భారీ ర్యాలీ , కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో కరీంనగర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పొన్నం పిలుపునిచ్చారు. గీతా భవన్ చౌరస్తా ఒగ్గు డోలు కళాకారులు, బోనాలు, బతుకమ్మలతో వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలతో నిండిపోయింది.
ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు
కరీంనగర్ టౌన్ : ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశామని కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ లో ఎంపీ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ మినహా మిగతా 7 నియోజకవర్గాల పోలింగ్ ఆఫీసర్ల థర్డ్ ర్యాండమైజేషన్ ను పరిశీలించారు. అనంతరం జనరల్ అబ్జర్వర్ అమిత్ కటారియాతో కలిసి కలెక్టర్ మీడియా తో మాట్లాడారు. కార్యక్రమంలో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, పూజారి గౌతమి, తదితరులు పాల్గొన్నారు.