మూగబోయిన మైకులు.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

దేశవ్యాప్తంగా  నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మైకులు మూగబోయాయి.  చివరి రోజున ప్రచారాలతో హోరెత్తించారు నేతలు.  బల్క్ SMSలపై ఈసీ నిషేదం విధించింది. నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండొద్దని ఆదేశించింది. కేంద్ర కంపెనీల బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేసింది.  ఇప్పటికే  దేశవ్యాప్తంగా  మూడు దశల్లో  285 లోక్ సభ సెగ్మెంట్ లలో  పోలింగ్ పూర్తైంది. మే13 సోమవారం రోజున  నాలుగో విడతలో 10 రాష్ట్రాల్లోని  96 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 1 వరకు  సాయంత్రం 6 గంటల 30 నిమిషాల  వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేదం విధించింది.  

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల క్రమంలో ఇవాళ (మే 11) సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.  పోలింగ్ జరిగే మే 13వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.  కల్లు కంపౌండ్‌లు కూడా ఓపెన్ కావు.  పోలింగ్ ముగిసిన తర్వాత  తిరిగి ఓపెన్ అవుతాయి.  శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.  

ఇక తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో  మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లో 45 మంది,  ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ..  25 లోక్‌సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387మంది పోటీలో నిలిచారు.