ఇంకా 48 గంటలే.. పోలింగ్​కు దగ్గర పడుతున్న గడువు 

  •     నేతలు, అభ్యర్థుల ఉరుకులు పరుగులు
  •     ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు
  •     అగ్రనేతల పర్యటనతో కాంగ్రెస్​లో జోష్

ఆదిలాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు, నేతలు పోలింగ్ కు గడువు దగ్గర పడటంతో స్పీడ్ పెంచారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే అగ్రనేతల ప్రచార సభలతో బలం చూపించుకోగా.. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్ల పడుతున్నారు. ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి మొదటిసారిగా మహిళ అభ్యర్థి ఆత్రం సుగుణ బరిలో ఉండగా, బీజేపీ నుంచి గోడం నగేశ్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కులు పోటీలో ఉన్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనుండగా, 11 నాటికి ప్రచారం సమయం ముగియనుంది. ఈ క్రమంలో ఆయా పార్టీ అభ్యర్థులు సాధ్యమైనంత మట్టుకు ఎక్కువగా గ్రామాలు చుట్టేసేందుకు సిద్ధమయ్యారు.

అభ్యర్థుల్లో టెన్షన్..

ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఈసారి టఫ్ ఫైట్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు తోడుగా మంత్రి సీతక్క గెలుపు బాధ్యతలు తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలో కాంగ్రెస్ గత మూడు నెలల్లో క్షేత్ర స్థాయిలో పుంజుకోవడం.. బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల చేరికతో ఎన్నికల ప్రచారంలో ప్రభావం చూపింది. అధికార పార్టీ నుంచి మహిళ అభ్యర్థి బరిలో ఉండటంతో సెంటిమెంట్ కూడా కలిసొస్తుందనే చర్చ జరుగుతోంది. అటు బీజేపీలో ఇప్పటికీ అంతర్గత విభేదాలు, అభ్యర్థి గోడం నగేశ్ పై వ్యతిరేకత ఉండడంతో ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం కనిపించలేదు.

నాలుగు సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క అమిత్ షా ఆసిఫాబాద్ లో మినహా మిగతా ఎక్కడ జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేయలేదు. బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనపడడంతో పాటు రాష్ట్ర అధినాయకత్వం సైతం ఆదిలాబాద్ పార్లమెంట్ పై అంతగా శ్రద్ధ పెట్టలేదనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రాథోడ్ బాపురావు, రేఖ నాయక్, విఠల్ రెడ్డి, వేణుగోపాల చారి ఇలా సీనియర్లంత కాంగ్రెస్ లో చేరిపోవడంతో ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ప్రచారానికి ఇంకా 48 గంటలే ఉండడంతో ఇక ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

చప్పగా సాగిన ప్రచారం.. 

ఈసారి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అంతగా జోష్ కనిపించలేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంతో చాలా గ్రామాల్లో ప్రచారం పూర్తి గా నిర్వహించలేకపోయారు. పలువురు లీడర్లు సైతం వడదెబ్బకు గురికావడం.. కార్యకర్తలు ప్రచారానికి వచ్చేందుకు భయపడటంతో ప్రచారం చప్పగా సాగింది. అయితే, రాహుల్ గాంధీ, రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సభలతో భారీ బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తీసుకొచ్చారు. అటు మంత్రి సీతక్క ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం జోరుగా చేశారు. బీజేపీ ఆసిఫాబాద్ లో నిర్వహించిన  ప్రచార సభకు కేంద్ర మంత్రి అమిత్‍షా హాజరయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ లేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ కాసింత నిరాశకు గురైంది. కేటీఆర్ ఒక్కడే జిల్లా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో 48 గంటలు ప్రచారానికి గడువు ఉండడంతో పార్టీలు ఉరుకులు పరుగులు తీస్తున్నాయి.