2014 , 2019 లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్‌లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించగా..ఇప్పుడు దానికి మరో టెక్నాలజీ జతైంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఐ జోరు కొనసాగుతున్నది. ఈ టెక్నాలజీతో వివిధ పథకాలను, ప్రకటనలను పార్టీలు ఈజీగా ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. పార్టీ ఉద్దేశాలను తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లకు రీచ్ అయ్యేలా ప్రచారం చేస్తున్నాయి. పక్క పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా.. తమ పార్టీ గురించి పాజిటివ్‌గా ప్రచారం చేయాలన్నా ఏఐకి పనిచెప్తున్నాయి.
వాయిస్ క్లోనింగ్‌తో లేనిది ఉన్నట్లు
పలు పార్టీలు వాయిస్ క్లోనింగ్ ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. డీప్‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. 2018లో మరణించిన కరుణానిధి తమిళనాడులోని అధికార డీఎంకే ఇటీవల నిర్వహించిన సమావేశానికి అతిథిగా అటెండ్ అయినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. రాష్ట్రంలో తన కొడుకు స్టాలిన్ నాయకత్వం బాగుందని డీప్‌ఫేక్ వీడియోలో కరుణానిధి ప్రశంసించారు. ఇటువంటి వీడియోలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తాయని నేతలు ఆందోళన చెందుతున్నారు.
రంగంలోకి ఎన్నికల సంఘం
డీప్‌ఫేక్‌లపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దానిద్వారా వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. గూగుల్ తన వినియోగదారులకు రాబోయే రోజుల్లో యూట్యూబ్, సెర్చ్‌లో ఎన్నికలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఓటుపై హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రజలకు సరైన సమాచారమిస్తుంది. ఎన్నికల సమయంలో ఏఐ రూపొందించిన కంటెంట్ ఆధిపత్యాన్ని ఆపడానికి కొన్ని ఫీచర్లను క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చింది. దీని ద్వారా సాధారణ వినియోగదారులు ఏఐ సృష్టించిన నకిలీ కంటెంట్‌ను గుర్తించగలరని పేర్కొంది.