- కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు136 రౌండ్లు
- ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో లెక్కించనున్న ఓట్లు 12,21,563
- మధ్యాహ్నం 3 గంటలకు తేలనున్న రిజల్ట్
మంచిర్యాల/ఆదిలాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. మే 13న జరిగిన పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. పోలింగ్‌కు, రిజల్ట్కు మధ్య బాగా గ్యాప్ రావడంతో అందరిలోనూ టెన్షన్ పెరిగింది. గత 20 రోజులుగా ఎంపీ అభ్యర్థులు, నాయకులతో పాటు ప్రజలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరికివారు లెక్కలు వేసుకుంటూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరినీ టెన్షన్ పెడుతున్నాయి.
పెద్దపల్లి స్థానానికి రెండు చోట్ల కౌంటింగ్
పెద్దపల్లి ఎంపీ ఎన్నికల కౌంటింగ్ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రెండు చోట్ల జరుగనుంది. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించనున్నారు. పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాలకు సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలోని మూడు సెగ్మెంట్ల ఫలితాలను ఇక్కడే ప్రకటిస్తారు. మొత్తం ఏడు సెగ్మెంట్ల ఫలితాలను రౌండ్ల వారీగా సెంటినరీ కాలనీలో ప్రకటించనున్నారు.
136 రౌండ్లలో కౌంటింగ్..
ప్రతి నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుల్స్ఏర్పాటు చేశారు. మంచిర్యాలకు 21 రౌండ్లు, చెన్నూర్ 17, బెల్లంపల్లి 17, పెద్దపల్లి 21, రామగుండం 19, మంథని 21, ధర్మపురి 20, మొత్తం 136 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు రిజల్ట్ వచ్చే అవకాశముంది. ఒక్కో టేబుల్‌వద్ద కౌంటింగ్ఏజెంట్లు, గెజిటెడ్ఆఫీసర్ తోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మైక్రో అబ్జర్వర్‌గా ఉంటారు. పోలింగ్ సెంటర్ల వారీగా కంట్రోల్‌యూనిట్లను తీసుకొచ్చి రిజల్ట్ బటన్ నొక్కుతారు.
ప్రతి నియోజకవర్గం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు వీవీ ప్యాట్లకు సంబంధించిన స్లిప్పులను లెక్కించి కంట్రోల్ యూనిట్లో పోలైన ఓట్లను సరిచూస్తారు. అనంతరం టేబుల్స్ వారీగా ఫలితాలను వెల్లడిస్తారు. కౌంటింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలను అమర్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు.
ఆదిలాబాద్ ఎంపీ ఎవరో..?
ఆదిలాబాద్ ఎంపీ ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, ఈవీఏంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల పరిశీలకులు, సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ ను నియమించారు.
అదిలాబాద్ జిల్లాలో టీటీడీసీలో బోథ్, ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లు లెక్కిస్తారు. సిర్పూర్, ఆసిఫాబాద్ ఓట్లు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో, నిర్మల్, ఖానాపూర్, ముథోల్ సెగ్మెంట్ల ఓట్ల కౌంటింగ్ సంజయ్ గాంధీ పాలిటెక్నికల్ కాలేజీలో జరగనుంది. పార్లమెంట్ పరిధిలోని 16,51,175 మంది ఓటర్లు ఉండగా 12,21,563 ఓటు హక్కువినియోగించుకున్నారు. ఒక్కో టేబుల్ పై 14 ఈవీఎంలు ఉంచి ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం 159 రౌండ్లలో ఓట్లు కౌంట్ చేస్తారు. ఆదిలాబాద్ 21 రౌండ్లు, బోథ్ 22 రౌండ్లు, సిర్పూర్ 23 రౌండ్లు, ఆసిఫాబాద్ 22, నిర్మల్ 22, ఖానాపూర్ 22 ముథోల్ 23 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు.