నేడు 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మూడు రోజుల క్రితం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తో దేశమంతా చర్చ, టెన్షన్ మొదలైంది. ఒకవైపు బీజేపీ, మరో వైపు ఇండియా కూటమి నేతలు ఎవరి వాదనలను వారు వినిపిస్తూనే ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్ కాదు. ఇందులో అబద్ధం ఎక్కువ, నిజం తక్కువ ఉంటుంది. కొద్ది సమయాల్లోనే ఎగ్జిట్ పోల్స్ కు అటుఇటుగా ఫలితాలు వచ్చాయి. కానీ, చాలా సందర్భాల్లో అబద్ధం అని రుజువయ్యాయి.
అవి పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు యథాతథంగా రాలేదు. దేశంలో ఒక పార్టీ అనుకూల మీడియా, ఎగ్జిట్ పోల్ చేసే సంస్థలు, వ్యక్తులు అదే పనిగా బీజేపీ అనుకూల స్టోరీలు చేయడం జరుగుతోంది. ఈక్రమంలో ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే వచ్చాయి.-----
నేల మీది నిజాన్ని చూపని మీడియా!
క్షేత్రస్థాయిలో నిజాన్ని, గత 40 ఏండ్లలో ఎన్నడూ లేనివిధంగా పెరిగిన నిరుద్యోగుల అసంతృప్తి, వారి సంఖ్యను, వారిలోని ఆక్రోశాన్ని ఎన్నడూకూడా మోదీ మీడియా చూపలేదు, చెప్పలేదు. సమస్యల మీద స్టోరీలు చేయలేదు. అధిక ధరల మూలంగా కోట్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన విషయంలోనూ అలాగే వ్యవహరించారు. మహిళల మీద బీజేపీ ప్రజా ప్రతినిధుల వరుస దాష్టీకాల మీద ఒక్కమాట మాట్లాడలేదు. దేశానికి పట్టెడు అన్నం పెడుతున్న రైతుల రుణమాఫీ, ఎమ్మెస్పీ మీద ఒక్కమాట లేదు. ఇలా చాలా విషయాల మీద మోదీ మీడియా మౌనం వహించింది. పీఎం మోదీ తన పది ఏండ్ల పాలనలో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. కానీ, ఇటీవల 70 దాకా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఒక్కరు కూడా ప్రజల సమస్యల మీద ప్రశ్నించలేదు. నిజానికి నేల మీద ఓటర్ల మనోభావాలు ఈసారి చాలా భిన్నంగా కనిపించాయి.
దూద్ కా దూద్.. పానీ కా పానీ
వాస్తవ పరిస్థితికి చాలా భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ఉన్నాయి. బీజేపీ నేతల 400 పార్ నిజం అవుతుందా? లేక ఇండియా కూటమి తమకు 295 సీట్ల కన్నా ఎక్కువే వస్తాయని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే చెప్పిన మాటలు నిజం అవుతాయా నేడు తేలిపోతాయి. దూద్ కా దూద్.. పానీ కా పానీ తేటతెల్లమవుతుంది. ఖర్గే మాట, యోగేంద్ర యాదవ్ లాంటి నేలమీది మనుషుల మాటలు నిజం కావాలని, అవుతాయి అని ఆశిద్దాం. బీజేపీ కి 240 సీట్లు దాటవు అని దేశంలోని సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు దైనిక్ భాస్కర్, టైమ్స్ అఫ్ ఇండియా, టైమ్స్ నౌ లో ఎడిటర్ లుగా పనిచేసిన అశోక్ వంక్డే, ప్రేమ్ కుమార్, రాకేష్ పాఠక్, కేపీ మాలిక్, శైలేష్ లాంటి వారు ఒక సర్వే రిపోర్ట్‌ను వెల్లడించారు. వారి లెక్క ప్రకారం బీజేపీ కి 200 లోపు, 230 లోపు, 204 లోపు, 240 లోపు కన్నా ఎక్కువ సీట్లు రావు.
కాంగ్రెస్, ఇండియా కూటమి 290 నుంచి 300 దాటే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. బీజేపీకి 350, 380 అంటూ లెక్కలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్కార్ ఎగ్జిట్ పోల్స్ అని ఈ సీనియర్ జర్నలిస్టులు తెలిపారు. ఇండియా కూటమి పేర్కొన్నట్లు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణను కోరుకునే వైపే మెజారిటీ ఓటర్లు మొగ్గు చూపారు. తెలంగాణలోనూ 17 స్థానాలో పెద్దపల్లి, ఖమ్మం లాంటి 10 నుంచి 13 స్థానాలు కాంగ్రెస్ పరం అవనున్నాయి అని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రానున్నది!
ఎండి మునీర్, సీనియర్ జర్నలిస్ట్